మామిడికాయతో చేసే రెండు రకాల ముక్కల పచ్చళ్ళు ....

 హలో ఫ్రెండ్స్.... రెండు వారాల నుంచి వంటలు రాయటం లేదు కారణం ఉగాది పండుగ, శ్రీరామనవమి వచ్చాయి కదా అందుకని వంటలు పక్కన పెట్టాల్సి వచ్చింది. నేను వ్రాసే పాతకాలం నాటి వంటలు మీకు నచ్చుతాయి అన్ని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎండలు మండుతున్నాయి. ఈ ఎండాకాలంలో పచ్చళ్ళు, వడియాలు, ఉప్పు మిరపకాయలు, ఒరుగులు అన్ని రెడీ చేసి నిలువు ఉంచుకోవటం అనేదే పూర్వకాలం నుంచి జరిగే ఆచారం, ఆ రోజుల్లో మరి పాత రోజుల్లో ఎండాకాలం ఆ పచ్చళ్ళు చేసుకొని వానాకాలం రాగానే వాడుకోవటం మొదలు పెట్టేవారు. కానీ ఇప్పుడు అలా కాదు ఎప్పుడు వీలుంటే అప్పుడే. 

 ఈ వారం మనం మామిడికాయతో చేసే రెండు రకాల ముక్కల పచ్చళ్ళు పరిచయం చేస్తాను.

 అందులో ఒకటి

 కావాల్సిన పదార్థాలు:- 

 బాగా గట్టిగా ఉన్న పచ్చడి మామిడికాయలు -3
 ఉప్పు- కావలసినంత
 కారం - కావాల్సినంత
 మెంతి పిండి - నిండుగా ఒక టీ స్పూను
 పసుపు - చిటికెడు
 నూనె - కావలసినంత
 నల్లటి లావుగా ఉన్న ఆవాలు - ఒక టీ స్పూను 
ఇంగువ మీ ఇష్టాన్ని బట్టి.


తయారుచేసే విధానం:-  ముందుగా మామిడికాయలు బాగా కడిగి తుడిచిన తర్వాత చిన్న చిన్న ముక్కలు గా కోసుకోవాలి. తర్వాత  ఒక బేసిన్ లో కావాల్సినంత ఉప్పు, కారం, మెంతి పిండి, పసుపు అన్నీ వేసి బాగా కలుపుకొని, అందులో మనము చిన్న ముక్కలు గా ఉంచుకున్న మామిడికాయ ముక్కలు అందులో వేసి చెంచాతో బాగా కలిపి ముత వేసి ఉంచండి. తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో సరిపడ నూనె వేసి వేడి చేయాలి. నూనే వేడి ఎక్కిన తరువాత, అందులో ఆవాలు వేసి  దానితో పాటు ఒక ఎండు మిరపకాయ గిల్లి అందులో వేసి వేగనివ్వాలి. తరువాత స్టవ్ కట్టేసి దానిలో ఇంగువ పొడి వేసి తరువాత దానిని బాగా చల్లారనివ్వాలి. తర్వాత ఆ నూనెను ముక్కల్లో వేసి బాగా కలుపుకోవాలి.  అంతే చాల రుచికరమైన ముక్కల  పచ్చడి తయారయింది. ఇక్కడ మీ అందరికీ ఒక మాట చెప్పాలి నేను కొలతలు ఇవ్వ డం లేదు ఎందుకంటె, కొంతమందికి పచ్చడి కలుపుకునే లా ఉండాలని ఉప్పు,కారం, మెంతిపిండి ఎక్కువగా వేసుకుంటారు.  కొంతమంది ముక్కలు మాత్రమే కావాలని లైట్ గా ఉప్పు, కారం, మెంతిపిండి వేసుకుంటారు. కొంతమంది, ఆవపిండి కూడ వేసుకుంటారు. ఆవ పిండి వేయటము వాళ్ళ  మా పిల్లలకి వేడి చేసింది. అందుకని ఆవ పిండి వేయటము మానేశాను.  మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. ఆవ పిండి వేయకపోవడం వల్ల ఎంత ఎక్కువగా పచ్చడితిన్న వేడి చేయడం అనేది ఉండదు . బ్యాచిలర్స్ కూడా నేను చెప్పిన విధానంగా తేలికగా చేసుకోవచ్చు ఆ ఒక్క పచ్చడి తోనే  అన్నం అంతా లాగించగలము.  దోసలోకైతే చెప్పే పని లేదు, అదిరిపోయే రుచి. కానీ బయట ఉంచితే వారం నిలువ ఉండదు. ముక్క మెత్తబడి మాగుడు వాసన వస్తోంది. ఫ్రిజ్లో అయితే చాలా రోజులు ఉంటుంది. కొంతమంది నూనె కూడా ఎక్కువ కలుపుతారు ఇదంతా ఎవరి ఇష్టం వారిది.



రెండవరకం ముక్కల పచ్చడి

ఈ రెండవ రకం ముక్కల పచ్చడి తేలిక. రుచి మాత్రము అమోఘం. 

కావలసిన పదార్థాలు 

మామిడి కాయలు - 5
 ఎండు మిర్చి -25
మెంతులు - నిండుగా 1 టీ స్పూను.
 నూనె - కావలసినంత
 ఇంగువ -పావు టీ స్పూను
 ఉప్పు- తగినంత


తయారుచేసే విధానం:- ముందుగా మామిడికాయలు బాగా కడిగి, తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి మూడు టీ స్పూన్ల నూనె వేసి, నూనె కాగిన తరువాత, అందులో ఎండుమిర్చి వేసి మాడకుండా వేయించుకోవాలి. తర్వాత అందులో మెంతులు వేసి వేయించి దించుకోవాలి. వేయించుకున్న మిర్చీ, మెంతులు, చల్లారిన తర్వాత మిక్సీలొ  వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.  తరువాత ఒక బౌల్లోకి తరిగి ఉంచుకున్న మామిడి ముక్కలను వేసుకోవాలి.   తర్వాత మిక్సీ వేసుకున్న ఎండుమిర్చి, మెంతుల పౌడర్ ను ముక్కల మీద వేసుకోవాలి. 



 తర్వాత ఆ ముక్కలకు సరిపడా ఉప్పు, కొంచం ఇంగువ పొడి, ఒక చెంచా నూనె వేసి, అన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి.  కలిపిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఒక గంట సేపు మూతపెట్టి ఉంచండి.  తరువాత వడ్డించుకొని తనివి తీరా ఆరగించండి.  అట్టులో చాలా సూపర్. 



Previous
Next Post »