పాత తరం కొత్త తరం మధ్య తేడాలు....

                      ఇప్పుడు ప్రపంచమంతా కరోనా కబంధహస్తాల్లో చిక్కివిలవిలలాడుతోంది. ఈ కరోనా వచ్చిన కొత్తలో, లాక్డౌన్ పెట్టినప్పుడు, పాటించిన జాగ్రత్తలు, అన్ని ఇప్పుడు మనకు విసుగును కల్గిస్తున్నాయి.   మనం చూపే కొంచం అశ్రద్ధకి ఎక్కువ మూల్యం చెల్లిస్తున్నాము.  మనం స్వేచ్ఛ లేకుండా బందీ ఖానాలో వున్నామనే భావనతో బయట మాస్క్ కూడా లేకుండా ఇష్టారాజ్యంగా రోడ్ల వెంట తిరుగుతున్నాము.  ఆ స్వేచ్ఛ కోసం మన ఆరోగ్యాన్ని , ప్రాణాలను పణంగా పెడతున్నాము. 

ఇప్పుడు డాక్టర్లు కరోనా సందర్భంగా మనకు చెప్పే జాగ్రత్తలు , ఆహారపు అలవాట్లు, వ్యాయామాలు, ధ్యానం లాంటివి చేయాలి అంటున్నారు.  కొంత మంది వాటిని పాటిస్తున్నారు. వాటి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది అంటున్నారు.  మన ఇళ్ళలోని పెద్దవాళ్ళ మాటలను నిర్లక్ష్యం చేస్తాము. కాని ఈ రోజు కరోనా మూలముగా మనము పాటించే పద్ధతులన్నీ ఒకప్పుడు మన పూర్వికులు ఆచరించినవే. 

పూర్వరోజుల్లో గాడిపొయ్యి, కట్టెల పొయ్యి, కుంపట్లు, పొట్టు పొయ్యి ఉపయోగించేవారు. కాలక్రమంలో వాటి స్థానంలో కిరోసిన్, గ్యాస్ స్టవ్ లు వచ్చాయి.  ఇప్పుడు ఇండక్షన్ ,  కరెంటు కుక్కర్లు వచ్చాయి.  వీటి వాడకం వల్ల ఆడవాళ్ళకి చాలా సౌకర్యముగా ఉంటుంది. ఈ మార్పు మంచిదే. కాని అన్ని వంటలు వాటిల్లో వండుతు రుచులు తెలియకుండా తింటున్నాము. వీటిలో ఉద్యోగాలు, బిజినెస్ లు చేస్తూ ఉరుకులు , పరుగులు , పెట్టే వాళ్ళకి, ఇటువంటివి బాగా ఉపయోగ పడతాయి. 

కాని ఇండ్లలో వుండేవారు రుచులు పోకుండా చేయవచ్చు కదా !  వంటకి పెట్టే సమయాన్నీ, అన్ని కలిపి కుక్కర్ లో పెట్టి టీవీ సీరియల్స్ చూస్తూ కాలం గడుపుతున్నాము. వండుకున్న మనకే నచ్చటము లేదు కదా ? 

టీవీలు చూసి మనము పొందుతున్న లాభం -- టెన్సన్స్, కోపాలు, కక్షలు, కుటుంబంలో కలహాలు ఇది అందరు కాదు అనలేని నిజం. నిజం ఎప్పుడూ నిష్టూరంగాన్నే ఉంటుంది కదా ! ఇంట్లో జనాలు రుచి లేకనే బయట తిండికి అలవాటు పడుతున్నారు.  ఇప్పుడు కరోనా పుణ్యమాఅని అందరు ఇళ్లకే పరిమితం అయి ఇంటి రుచులనే అస్వాదిస్తున్నారు.  దీని వలన హాస్పిటల్స్ కి వెళ్ళే వారి సంఖ్య తగ్గి ఆరోగ్యంగా వుంటున్నారు.  ఇది జగమెరిగిన సత్యం.  పాత పద్దతులను అసహ్యoచుకోకుండా, కొత్త పద్ధతులను ఆస్వాదించండి. 

కరోనా వచ్చిన తరువాత, చేతులు, కాళ్లు కడ్డుక్కోవాలి, బలమైన ఆహరం తీసుకోవాలి,వ్యాయామాలు చేయాలని అంటున్నారు. జనాలు కూడా చాలా వరకు వాటిని అనుసరిస్తున్నారు.  

పాత రోజుల్లో బయట నుంచి ఎవరు వచ్చినా, కాళ్ళు కడ్డుక్కొండీ అని నీళ్ళు తెచ్చి ఇచ్చేవాళ్ళు లేదా బయట నీళ్ళ బకెట్ ఉంచుతారు, తర్వాత కానీ వారు లోపలికి వచ్చే వారు కాదు. అలాగే ఇళ్ళలో కూడ కాలకృత్యాలు తీర్చుకోవటానికి వెళ్ళాలన్నా వేరే బట్టలు మార్చుకొని  వెళ్తారు.  ఇప్పటికి కూడ కొంత మంది వీటిని అనుసరిస్తున్నారు.  ఇక ఆహరం విషయానికి వస్తే  మసాలాలు, ఉప్పు, కారం, నూనెలు మితముగా వాడుతూ ఆహారాన్ని అద్భుతముగా తయారు చేస్తారు.  వాళ్ళు ముందు రోజు రాత్రి మిగిలిన అన్నంలో మజ్జిగ లేకుంటే నీళ్ళు పొసి కుండలో ఉంచుతారు.  దానిని ఉదయాన్నే పచ్చిమిరపకాయ , ఉల్లిపాయ ఏదో ఒకటి నంజుకొని  తినే వాళ్ళు లేదా రాగి సంకటి, ఆవిరి కుడుము, పెరుగు అన్నం ఇలాంటివి ఏదో ఒకటి తిని మధ్యాహ్నం దాక కష్టపడి పని చేసేవాళ్ళు. 

తరువాత వ్యాయామ విషయానికి వస్తే తొలికోడి కూసేవేళ నిదుర లేచి, ఆడవారు ఇంటి పెరటి చుట్టూ చిమ్మి పేడ నీళ్ళు చల్లి ముగ్గులు వేసేవాళ్ళు.  బయట చెరువులు, బావుల నుంచి నీళ్ళు మోసుకొని తెచ్చుకునేవాళ్ళు.  దంతావధానానికి వేప పుల్ల, ఉత్తరేణి పుల్లలు, కచ్చిక, వరిపొట్టుపొడి(మాడ్చినది) వీటిని వాడే వారు. పంటి నొప్పులు, పళ్ళు పుచ్చటాలు వాళ్ళకి తెలియవు.

స్నాన్నానికి చెరువులు, బావుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు.  చల్లటి నీటిలో ఉదయాన్నే చేసే స్నానం ఒంటికి చాలా మంచిది.  ఒళ్ళు రుద్దుకోవటానికి శీకాయపొడి, కొబ్బరిపీచు ఉపయోగించేవాళ్ళు లేదా తుండు తడిపి మెలిపెట్టి గట్టిగ పిండి దానితో గట్టిగా రుద్దుకొని స్నానం చేసేవాళ్ళు.  దీని వలన రక్తప్రసరణ బాగా జరుగుతుంది.  

ఇక ధ్యానం విషయానికి వస్తే , ఏ పని మీద అయినా మనసుపెట్టి వేరే ఆలోచన లేకుండా చేస్తే అదే " ధ్యానం " అవుతుంది. 

ఈ రోజుల్లో కూడా కొన్ని హోటల్స్ లో పాత పద్దతుల్లో చేసిన విధముగా కట్టెల పొయ్యిలో వంటలు, బిర్యానిలు చేస్తున్నారు.  పెరుగు, మజ్జిగలకి కుండలని వాడుతున్నారు. అవి చాలా మంచివని జనాలు తెగ ఇష్టపడుతున్నారు. 

ఇవి అన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి దినచర్య వలన మన " రోగనిరోధక శక్తి  " పెరుగుతుంది. మనలో ఆవేశాలు, కోపాలు అన్ని అదుపులో వుంటాయి. " తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష" అనే విషయం అందరికి తెలిసిందే. 

నేను కొత్త విధానాల్నీ తప్పు పట్టడము లేదు. 

మనం  ఎంత అభివృద్ధిని సాధించినా, మన పెద్దలు ఆచరించిన వాటిని మరువకుండా పాటించాలి. ఇంట్లో వున్న నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యల ను అడిగితే పిట్ట కథలుగా అన్ని వివరించి చెపుతారు. మన మందరం కొత్త పద్దతలు నేర్చుకోని, ఇంట్లో తెలియనివాళ్ళకి, తెలియపరచాలి. అంతే కాని " కొత్త ఒక  వింత , పాత ఒక రోత " అన్నట్లుగా  ప్రవర్తించకూడదు.

పాత అనుభవాలతో కూడిన ఆలోచనలు + కొత్త ఆవేశం తో కూడిన ఆలోచనలు = అభివృద్ధిలోకి పయనము.

అర్థంచేసుకుంటారని తలుస్తాను....


ఈ వారము చిట్కాలు

1) పెను కొరుకుడు:-  కొంత మందికి తల మీద అక్కడక్కడ జుట్టు ఊడిపోయి, మెదడు కనిపిస్తుంటుంది. ఇంకొంత మందికి సాంతం మాడు కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారికి అరుదైన చిట్కా. 

ఒంటిరెక్క ఎర్ర మందార పువ్వులను తీసుకుని వాటిని మెత్తగా రుబ్బుకోవాలి, నీరు కలుపకూడదు. తరువాత ఆ ముద్దను బాగా తలకు వేసి రుద్దాలి. ఎక్కడ మాడు కనిపిస్తోందో అక్కడ బాగా రుద్దాలి. ఒక వారం రోజులకి ఆ మాడు భాగము నలుపుగా అవటము చూస్తారు. ఇది రుద్దుకొని కనీసం 3 గంటలు వుండి ఆ తరువాత స్నానం చేయండి. ఆ విధముగా చేస్తే తొందరలో మీరు మార్పును చూస్తారు.


ప్రియమైన పాఠకులారా  - దయ చేసి మీ యొక్క అమూల్యమైన సూచనలు మరియు సలహాలు ఈ క్రింద కామెంట్స్ లో తెలియజేయగలరు.


Previous
Next Post »