దుర్గాదేవి భీకర పోరాటం చేసి పదవ రోజున తన త్రిశూలం చేత పూని దానితో మహిషాసురుణ్నివధిస్తుంది. చెడు మీద మంచి జయిస్తుంది అనేది సూత్రం, ఈ మహిషాసురవధ ద్వారా మనకు అర్థం అవుతుంది. అప్పటి నుండి దుర్గాదేవికి "మహిషాసురమర్దిని" అనే పేరు వచ్చింది. అప్పటి నుంచి ప్రజలంతా ప్రతి సంవత్సరం విజయదశమి పండుగను చేసుకుంటున్నారు. ఆ రోజున ఏ పని ప్రారంభించినా ఆ పని విజయవంతం అవుతుంది.
పాండవులు తమ అజ్ఞాతవాసాన్ని విజయదశమి రోజున ముగించి యుద్ధానికి బయలుదేరుతారు, విజయాన్ని సాధిస్తారు. ఆ రోజున ఆయుధాలు పూజిస్తారు. చదువుకునే పిల్లలు దేవుడు దగ్గర పుస్తకాలు, పెన్ను, పెన్సిల్ అన్ని పెట్టి గణపతిదేవుని (సరస్వతీ దేవిని) పూజిస్తారు. విజయదశమి రోజున దేవి ప్రశాంతంగా ఆదిపరాశక్తి గా దర్శనమిస్తుంది. దేవికి ఇష్టమైన ప్రసాదం బెల్లం పొంగలి లలితా సహస్రనామం లో " గుడాన్న ప్రీతమానసా" అని ఉంటుంది. గుడాన్న( పొంగలి ) ఎలా చేయాలో మీకు వివరిస్తాను. అలాగే ఈ పది రోజులు పసుపు గణపతిని కూడా పూజిస్తాము కాబట్టి వినాయకునికి ఇష్టమైనది ఉండ్రాళ్ళు అది కూడా మీకు వివరిస్తాను. వినాయకునికి, దేవికి నైవేద్యం పెట్టిన తరువాత అమ్మవారికి వాయనం ఇవ్వాలి. తర్వాత అమ్మవారిని కదిలించాలి మంగళ శుక్రవారాల్లో అమ్మవారిని తియ్యకూడదు.
ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, ప్రియశక్తి, స్వరూపిని ఆ దేవి. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు !!!
ముందుగా వినాయకుడికి ఉండ్రాళ్ళు
కావలసిన పదార్థాలు:-
బియ్యం పిండి - ఒక గ్లాసు, కొబ్బరికాయ - ఒకటి, బెల్లం - 3/4, యాలకలు కొంచెం, నెయ్యి కావాల్సినంత, ఉప్పు చిటికెడు.
తయారుచేయు విధానం:- ఒక పెద్ద గ్లాస్ బియ్యప్పిండిని తీసుకొని దాన్ని బాగా వేయించుకోవాలి ,తర్వాత స్టవ్ మీద నీళ్ళు మరిగించాలి. ఒక గ్లాసు బియ్యప్పిండి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. దానిలో చిటికెడు ఉప్పు రెండు చెంచాల నెయ్యిని బాగా మరిగిన తర్వాత అందులో వేయించుకున్న బియ్యప్పిండి వేసి కలిపి పక్కన ఉంచుకోవాలి. తరువాత బెల్లాన్ని కొంచెం నీరు పోసి మరిగించి వడకట్టాలి. వడకట్టిన తరువాత కొబ్బరి తురుమును తెర్లే బెల్లంలో వెయ్యాలి. అందులో చెంచాడు యాలకుల పొడి, కొంచెం నెయ్యి వేసి తిప్పుతూ ఉండాలి. బెల్లం కొబ్బరి బాగా కలిసి గట్టిపడుతుంది. తర్వాత దించి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ముందుగా ఉడికించిన బియ్యపు పిండిని బాగా పిసికి ముద్దగా చేసుకోవాలి తరువాత చేతిని కొంచెం నూనెగాని నెయ్యి గాని రాసుకుని బియ్యప్పిండిని నిమ్మకాయంత ముద్ద తీసుకొని చేతిలో చిన్న పూరీలా వత్తుకొని అందులో కొబ్బరి స్వీట్ ను ఒక చెంచాడు నుంచి నాలుగు వైపులా మూసి ఉండలాగా చేసి పెట్టుకోవాలి. అన్నీ చేసుకుని తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకొని దాని ప్లేటుకు నూనె రాసి దాని మీద ఈ ఉండలు ఉంచి ఇడ్లీ పాత్రను స్టవ్ మీద పెట్టి ఉడికించాలి. పదిహేను నిమిషాల తర్వాత స్టౌ కట్టేసి ఒక గంట సేపు అలాగే ఉంచాలి. తర్వాత మూత తీసి ఒక స్పూన్ తో ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. చాలా చాలా రుచికరమైన ఉండ్రాలు తయారయ్యాయి. స్వామికి నివేదించి ఆరగించండి.
బెల్లం పొంగలి:- లలితా దేవికి ప్రీతికరమైన ప్రసాదం ఇది.
కావలసిన పదార్థాలు:-
బియ్యం- అర కప్పు, ఛాయ పెసరపప్పు- అర కప్పు, బెల్లం- ఒక కప్పు, యాలకుల పొడి ఒక చెంచాడు, నెయ్యి పావు కప్పు, జీడిపప్పు, కిస్మిస్ సరిపడా, పాలు - 4 కప్పులు.
తయారు చేసే విధానం:- ముందుగా స్టవ్ వెలిగించుకొని బాణలి పెట్టి అందులో అర కప్పు పెసరపప్పు వేసి దోరగా వేయించాలి, తరువాత బియ్యం, పెసరపప్పు రెండు కలిపి బాగా కడిగిన తర్వాత కుక్కర్ లోకి బియ్యం, పప్పు రెండు వేసి నాలుగు కప్పుల పాలు పోసి నాలుగు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి తర్వాత కుక్కర్ ను పక్కన ఉంచి వేరే గిన్నెలో ఒక కప్పు బెల్లం తురుము వేసి అరకప్పు నీళ్లు పోసి కరిగించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ విజిల్ పోయి ఉంటుంది. కుక్కర్ మూత తీసి కరిగించిన బెల్లాన్ని ఫిల్టర్ లో పోసి జల్లెడపట్టి ఒక బాండీలో పోసి మరల మరిగించుకోవాలి. అది మరిగిన తరువాత అందులో ఉడికించిన అన్నం, పెసరపప్పు రెండూ కలిపి వేసి బాగా కలపాలి తర్వాత అందులో ఒక చెంచాడు యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఇది బెల్లం పాకంలో కలిసి బాగా ఉడికి దగ్గర పడిందాకా ఉడికించాలి. ఇప్పుడు వేరే బాండీలో పావు కప్పు నెయ్యి వేసి మూడు చెంచాల జీడిపప్పు రెండు చెంచాల కిస్మిస్ వేసి బాగా వేయించాలి. వేగిన తరవాత దీన్ని పొంగల్ లో వెయ్యాలి, పొంగలి మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఉండాలి. అంతే ఎంతో రుచికరమైన బెల్లం పొంగలి రెడీ. దేవికి నైవేద్యం సమర్పించి తల్లి ఆనందంతో ఇచ్చే దీవెనలు అందుకోండి. తల్లిని తలుచుకుంటూ రుచిగా ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఆరగించండి.
శరణ్యే త్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే !!!
ఈ వారం చిట్కాలు:-
సన్నటి వాళ్ళు లావుగా అవ్వాలంటే:- రాత్రి పడుకునే ముందు పాలలో రెండు చెంచాల తేనె కలుపుకుని త్రాగాలి. ఉదయం పరగడుపున ఉసిరి కాయ రసం మధ్యాహ్నం భోజనం తర్వాత అరటిపండు తిని రాత్రి పాలు, తేనె తీసుకుని కంటినిండా నిద్ర పోతే కొన్ని రోజులకి మంచి అందం, ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.
బాగా రక్తం పట్టడానికి:- ప్రతిరోజు పిల్లలు, పెద్దలు ఎవరైనా రక్తహీనత కలిగి ఉన్నవాళ్లు టమోటా పండ్లు తీసుకుంటూ ఉంటే నెత్తురు బాగా పడుతుంది, రక్తహీనత తగ్గుతుంది.



1 Comments:
Click here for CommentsBAGUNDI
ConversionConversion EmoticonEmoticon