దసరా నవరాత్రి పూజ విధానం

 

                               ఓం శ్రీ మహా గణాధిపతయే నమః

నవరాత్రి పూజ విధానము:-  

     నవరాత్రి పూజ ఎందుకు ఎలా అని కొందరికి సందేహాలు  ఉంటాయి. కొంతమంది ఈ పూజ  విద్యార్థులకు మాత్రమే అనుకుంటారు, కానీ ఎవరైనా మాతృమూర్తి అయిన ఆ తల్లిని పూజిస్తే మంచిది. నవరాత్రి అంటే తొమ్మిది రోజుల పూజ, చేయగలిగిన వారు ఆ తొమ్మిది రోజులు చేయలేనివారు 7 రోజులు అది కుదరకపోతే 5 రోజులు అది కుదరకపోతే 3 రోజులు లేకపోతే ఒక రోజు పూజ చేస్తారు. కానీ తొమ్మిది రోజుల పూజ చాలా విశిష్టమైనది.  నవరాత్రి పూజ రోజుల్లో పార్వతీదేవిని, లక్ష్మీదేవిని, సరస్వతి దేవిని పూజిస్తారు. నవరాత్రి సమయంలో దుర్గామాతను తొమ్మిది రూపాల్లో కొలుస్తారు. కుజదోషం రాహు దోషం లాంటి దోష నివారణకు అత్యుత్తమమైన మార్గం దేవి ఉపాసనకి మించినది లేదు.   సప్తమి, అష్టమి,నవమి దేవికి చాలా ముఖ్యమైన రోజులు. అష్టమి రోజున దుర్గామాత గా, నవమి రోజున లక్ష్మీ దేవి గా, దశమి రోజున సరస్వతి దేవి గా ఆరాధిస్తారు. మనస్సు శరీరం రెండు పవిత్రతను  సంతరించుకుంటాయి.  

 పూర్వకాలంలో పెద్దలు మొదటి మూడు రోజులు పార్వతీదేవికి తర్వాత మూడు రోజులు లక్ష్మీ దేవికి తర్వాత మూడురోజులు సరస్వతి దేవికి ప్రాముఖ్యత ఇచ్చేవారు.  ఈ నవరాత్రుల్లో సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలారా స్నానం చేసి దీపం వెలిగించి దేవి స్తోత్రాలు చదవాలి. అన్నింటికన్నా ముఖ్యమైనది శ్రీ లలితా సహస్రనామం,  ఇది చాలా విశిష్టమైనది.  ఆ దేవి ఇచ్ఛాశక్తి,  ప్రియా శక్తి, జ్ఞాన శక్తి కలిగిన  త్రిమాతల ఆరాధనే నవరాత్రి.

     నవరాత్రి పూజ మొదలు పెట్టాలంటే కొంతమందికి కలశం పెట్టి నిష్ఠగా తొమ్మిది రోజులు చేయడం అంటే ఇప్పటి బిజీ జీవితానికి చాలా కష్టం.అలాంటి వాళ్లు చేసుకునే సులభమైన పద్ధతిని వివరంగా చెప్తాను.     

      రేపు నవరాత్రి పూజ మొదలుపెడతారు అనగా ముందురోజు ఒక పీటను శుభ్రంగా కడిగి దానికి పసుపు రాసి బియ్యపిండితో అష్టదళ పద్మం ముగ్గు వెయ్యాలి. తర్వాత ఎక్కడ పూజ చెయ్యాలి అనుకుంటామో ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసుకొని ముగ్గు వేసి ఆ భాగంలో పీటను ఉంచాలి.ఆ పీట మీద ఒక ఎఱుపురంగు వస్త్రాన్ని పరవాలి. దాని మీద కొంచం బియ్యం పోసి, పసుపు, కుంకుమ వేసి దాని మీద అమ్మవారి పటాన్నిఉంచాలి.తరువాత పసుపు తో గణపతిని, అమ్మవారిని చేసుకోవాలి. తమలపాకు తీసుకొని దానిమీద మొదటిగా పసుపు వినాయకుని ఉంచాలి. ఇంకొక తమలపాకు మీద పసుపు అమ్మవారిని ఉంచాలి. మరుసటి రోజు ఉదయాన్నే (బ్రహ్మ ముహూర్తంలో) లేచి తలస్నానం చేసి దీపం వెలిగించాలి.  రెండు వత్తులు (ప్రకృతి, పురుషుడు) వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి, ఒత్తులు రెండు కలిపి వెలిగించాలి. మొదటిగా వినాయకుని ప్రార్థించాలి ఆ తరువాత మీ మీ ఇష్టదేవతలను, నవగ్రహ దేవతలను, పితృదేవతలను తలచుకోవాలి .

            ఆ తరువాత అమ్మవారి పూజ ప్రారంభించాలి. దేవి పూజ లో మీకు చేతనైన స్తోత్రాలు చదువుకోవచ్చు.  పూజలో చదువవలసిన ముఖ్యంగాదుర్గా అష్టోత్తరం, మహాలక్ష్మి అష్టకం, సరస్వతి ద్వాదశ నామ స్తోత్రం, లలితా సహస్రనామ స్తోత్రం చదవాలి.  మీకు వీలై చేయగలిగితే లలితాసహస్ర నామావళి కుంకుమపూజ చేస్తూ చదవండి.  ఇలా తొమ్మిది రోజులు చేయలేకపోతే ముందు చెప్పిన విధంగా 7,5,3,1 రోజులు  కూడా చేసుకోవచ్చు.  ఎలా చేసినా మన మనసే ముఖ్యం.  ఉదయం తప్పనిసరిగా బెల్లం పొంగలి, వడపప్పు పానకం, నైవేద్యంగా పెట్టండి. ఆ తరువాత మీ ఓపిక ననుసరించి పెట్టుకోండి. అలాగే సంధ్య వేళ కూడా దీపం వెలిగించి లలితా సహస్రనామం చదవండి. వీలైతే ఇష్టం ఉన్నవాళ్ళు సాయంత్రం గుగ్గిళ్లను నైవేద్యంగా పెట్టండి. పదవరోజు ముత్తైదువను పిలిచి (అమ్మవారిగా తలుచుకొని)  తాంబూలం  వాయనం ఇవ్వండి. (చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, పండు తాంబూలం, రూపాయి నాణెం, గాజులు, ప్రసాదం, పూలు) ఇవన్నీ కలిస్తేనే అమ్మవారికి  వాయనం అవుతుంది.  

వాయనం ఇచ్చేటప్పుడు "ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటి వాయినం" అని మూడు సార్లు చెప్పాలి. ఆ వాయనం తీసుకునే ముత్తయిదువను దేవి అనుకొని ఇవ్వాలి, దేవి తో సమానం.  మీకు శక్తి లేకపోతే ఉత్త తాంబూలం అయినా ఇవ్వవచ్చు. మనసుపెట్టి దేవుని ప్రార్ధించడం ముఖ్యం.

కథ:-

        పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు బ్రహ్మ గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. అతని ఘోరమైన తపస్సుకి మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు మహిషాసురుడు మరణం లేకుండా వరం అడుగుతాడు. అప్పుడు బ్రహ్మ అది సాధ్యం కాదు, ఇంకా ఏదైనా వరం కోరుకోమంటాడు. అప్పుడా రాక్షసుడు జంతువుల వల్ల, దేవతల వల్ల, పురుషుల వల్ల మరణం లేకుండా, ఒక  స్త్రీ చేతిలో మాత్రమే తనకు మరణం సంభవించాలని వరంఅడుగుతాడు.  బ్రహ్మవరం ప్రసాదిస్తాడు. ఆ వరగర్వంతో మునులను, దేవతలను హింసిస్తాడు.మూడు లోకాల్లో తనకు ఎదురులేదని విర్రవీగి స్వర్గాన్ని ఆక్రమిస్తాడు.  అప్పుడు ఇంద్రాది దేవతలంతా కలిసి త్రిమూర్తులను ఆశ్రయిస్తారు. అప్పుడు వారు ముగ్గురూ వాళ్ల వాళ్ల శక్తులను ఉపయోగించి ఒక స్త్రీ మూర్తిని సృష్టిస్తారు.  ఆ స్త్రీ వాళ్ళ ఆయుధాలు, వాళ్ల శక్తులన్నీకలిసి దుర్గాదేవిగా అవతరిస్తుంది.  ఆ దేవి సింహవాహనం అధిరోహించి మహిషాసురుణ్ని వధించడానికి బయలుదేరుతుంది. తొమ్మిది రోజుల భీకర పోరాటం చేసి మహిషాసురుని దేవి సంహరిస్తుంది.  త్రిమూర్తులు దేవతలు అందరూ సంతోషించి దేవి పై పుష్ప వర్షం కురిపిస్తారు. పదవ రోజున ఆ దేవి రాజరాజేశ్వరిగా ప్రశాంతంగా తన భక్తులను కరుణిస్తుంది.  ఆ రోజునే మనం విజయదశమి గా పండగ చేసుకుంటాము.

      ఈ తొమ్మిది రోజులు ఆ దుర్గాదేవిని 9 స్వరూపాలుగా ఆరాధిస్తాము. 

 1) శైలపుత్రి 2) బ్రహ్మచారిణి 3) చంద్ర గంట 4) కుష్మాండ 5) స్కందమాత 6) కాత్యాయిని 7) కాలరాత్రి 8) మహాగౌరి  9) సిద్ధిదాత్రి.

రోజూ పూజ మొదలుపెట్టినప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. ఆ దేవి కరుణ వల్ల ప్రజలంతా ఆయురారోగ్య, ఐశ్వరర్యాలతో తులతూగుతారు.

అందరికి నవరాత్రి శుభాకాంక్షలు. 

                                   సర్వే జనా సుఖినోభవంతు !!!

ఈ వారం చిట్కా:- 

 తల తిరగడం:-    పైత్యం వల్ల కొందరికి ఉదయంవేళ తల తిరుగుతుంది అలాంటి వారు కొంచెం అల్లం తీసుకొని రసం తీసి దానికి ఒక నిమ్మకాయ రసం కలిపి తాగితే తలతిరగడం తగ్గుతుంది.

కడుపులో మంట:-  కడుపులో మంట కూడా పైత్యం వల్ల వస్తుంది కానీ దీనికి వైద్యం వేరు కొంచెం జీలకర్ర తీసుకొని అందులో ఒక కాయనిమ్మరసం కలిపి ఐదు నిమిషాలు అలాగే ఉంచి తినాలి ఇందులో చక్కెర తేనె అలాంటివి కలపకూడదు.

వాంతులు:-   ఏ కారణంగానైనా వాంతులు అయితే రెండు చెంచాల నిమ్మరసం రెండు చెంచాల తేనె కలిపి తీసుకుంటే తగ్గుతుంది.


Previous
Next Post »