ధనుర్మాసం విశిష్టత -- గోదాదేవి కళ్యాణం

                                 కార్తీక మాసం స్నానాలు, దీపారాధనతో గడిచిపోయింది.  కార్తీకం తర్వాత మార్గశిర మాసం. ఈ మాసం విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన మాసం. దీనిని ధనుర్మాసం అని కూడా అంటారు.  ధనుర్మాసం అనగా సూర్యుడు ధనురాశిలో ప్రవేశించినప్పటి నుంచి తిరిగి మకర రాశిలోకి ప్రవేశించే మధ్యకాలాన్ని ధనుర్మాసం అని అంటారు. 

                             ఈ కాలాన్ని ధనుస్సంక్రమణం అని కూడా అంటారు. ఈ ధనుర్మాసంలో శ్రీ వ్రతం అని చేస్తారు. ధనుర్మాస వ్రతం కూడా చేస్తారు. ఈ ధనుర్మాస వ్రతం విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది. ఈ నెల రోజులు స్వామికి ప్రసాదంగా దద్దోజనం, పులిహోర, పొంగలి, నైవేద్యంగా పెట్టి అందరికి పంచుతారు. 

                        కలియుగ వైకుంఠమైన తిరుపతి లో కూడా ఈ ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం చదివే సమయంలో తిరుప్పావైని భక్తి శ్రద్ధలతో పాటిస్తారు.  విష్ణు సహస్రనామాలు, అష్టోత్తర నామాలు చదివి తులసిదళాలు, పూలతో పూజించాలి. ఇంట్లో పూజ చేసుకున్నా కొంచెం అటూ ఇటూగా ఇలాగే చేయాలి. పొంగలి ముఖ్యం తర్వాత దద్దోజనం, పులిహోర ఏదో ఒకటి చేసి నైవేద్యంగా పెట్టాలి చివరి రోజున గోదాకల్యాణం చేయాలి. ఎక్కువగా శ్రీకృష్ణుని ప్రతిమను పెట్టి పూజించాలి.  ఈనెల బాగా చలిగా వున్నా ఆడపిల్లలు తెల్లవారుజామునే లేచి, ఇంటి ముందు శుభ్రం చేసి పేడ నీళ్ళు చల్లి, చక్కటి ముగ్గులతో వాకిళ్లను తీర్చిదిద్దుతారు.   ఆ తరువాత శ్రీకృష్ణుని విగ్రహం ముందు దీపాలు వెలిగించి, తిరుప్పావై, తిరువెంబావై భక్తితో చదువుతారు. ఈ విధంగా పూజించి ఈ పాశురాలను చదివితే తమకు త్వరగా వివాహం జరుగుతుందని బాలికల నమ్మిక. శ్రీ గోదాదేవి గురించి ఆమె చేసిన వ్రతం ఇది. దీనిని గోదాదేవి కథ అని, శ్రీ వ్రతం అని అంటారు.

                 పూర్వం రోజుల్లో తమిళనాడులో విల్లిపుత్తూరు అనే గ్రామం ఉండేది. అక్కడ విష్ణుచిత్తుడు అనే ఆయన ఉండేవాడు. ఆయన గొప్ప విష్ణు భక్తుడు. అక్కడ కొలువైన విష్ణుమూర్తి వటపత్రశాయి రూపంలో ఉండేవాడు. ప్రతి రోజు స్వామికి పూలమాలలు కట్టి స్వామికి సమర్పిస్తాడు.  విష్ణుచిత్తుడుకు సంతానం లేదు.  ఒకనాడు తులసి కోటకు పూజ చేస్తుండగా తులసి కోట చెంత ఒక పాప దొరుకుతుంది.  అయోనిజగా దొరికిన ఆ పాపకి "గోదాదేవి" అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచుతాడు. చిన్నతనం నుంచి తన తండ్రి చెప్పే విష్ణుమూర్తి కథలు, వింటూ మనసంతా హరిభక్తిని నింపుకుని పెరిగి పెద్దదవుతుంది. ఆమె యుక్త వయస్కురాలు అవుతుంది. ఆమెకి వయసు తో పాటుగా, స్వామి మీద భక్తి కూడా పెరుగుతుంది. వటపత్ర సాయి రూపాన్ని కాకుండా శ్రీ రంగనాథ స్వామి రూపాన్ని మనసులో ముద్రించుకుని ఆరాధిస్తుంది.  ఆ ఆరాధన ఎంత బలమైనది అంటే  ఆయననే వివాహమాడాలని దృఢనిశ్చయంతో ఉంటుంది.  ప్రతి రోజు విష్ణుచిత్తుడు స్వామికి కట్టిన మాలలు ముందుగా తను ధరించి  అద్దంలో చూసుకుని ఆ తరువాత తీసి బుట్టలో ఉంచేది. ఇది తెలియని ఆమె తండ్రి వాటిని స్వామికి సమర్పించేవాడు. ఒకనాడు స్వామికి సమర్పించిన దండలో ఒక వెంట్రుక కనిపిస్తుంది. అది చూసి కోపంతో గోదాదేవిని నిలదీయగా ఆమె తను ధరించాను అని చెప్తుంది. ఆ స్వామిని వివాహం చేసుకుంటానని కూడా చెప్తుంది. ఆ మాటలకు తండ్రి చాలా విచారిస్తాడు. ఆ రోజు రాత్రి స్వామి విష్ణుచిత్తుడు కి కలలో కనిపించి గోదాదేవిని తాను వివాహం చేసుకుంటానని మాట ఇస్తాడు.  గోదాదేవి ధనుర్మాస 30 రోజులు ఆ స్వామిని పాశురాలతో అర్చించి 30 రోజున ఆ స్వామిలో ఐక్యం అవుతుంది. ఇంత భక్తితో చేసిన గోదాదేవి  రచించిన పాశురాలు రోజుకొక్క పాశురం చొప్పున చదువుతూ ఆ స్వామిని పూజిస్తూ ఉండేవారికి ఇహ పర సౌఖ్యాలు తప్పక కలుగుతాయి.

                ఈ ధనుర్మాసంలో మన  ముంగిళ్ళన్నీకళకళలాడుతూ ఉంటాయి. సాయంత్రం వాకిళ్లను శుభ్రం చేసుకుని  పేడనీళ్ళు చల్లి, ఆరిన తర్వాత పెద్ద, పెద్ద ముగ్గులు వేస్తారు. ఆ ముగ్గుల మీద ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి, ఆ గొబ్బెమ్మల మీద బియ్యపిండితో ముగ్గువేసి, పసుపు, కుంకుమ బొట్లు పెట్టి,   పూలు పెట్టి, ముగ్గుల మీద అలంకరిస్తారు. ఆ గొబ్బెమ్మలు మధ్యాహ్నానికి తీసి పిడకలాగా కొట్టి ఎండబెడతారు. ఆ పిడకలతో రథసప్తమి నాడు ఆవుపాలతో పొంగలి చేసి సూర్యునికి నైవేద్యం పెడతారు. భోగి రోజున గోదాదేవికి, శ్రీరంగనాథునికి కళ్యాణం చేసి ధనుర్మాసానికి  శుభం పలుకుతారు. 

                                 సర్వేజనా సుఖినోభవంతు!!

---------------------------------------------------------------------------

 డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం ముగ్గులు మొదలుపెడతారు.  అందుకని ఈ నెల నుండి చిట్కాలు బదులు ప్రతి వారం రెండుగానీ, మూడు గాని ముగ్గులు పెడతాను. ఈ ధనుర్మాసంలో స్వర్గద్వారాలు తెరిచే ఉంటారని పెద్దలు చెబుతారు. అందుకని ఈ నెలరోజులు ముగ్గులు వేసేటప్పుడు వాకిళ్ళు తెరిచి ఉంచినట్లుగా ముగ్గులు వేయాలి. సంక్రాంతి రోజున సాయంత్రం వాకిళ్ళు  మూసినట్లు గా ముగ్గు వేస్తారు. వాకిళ్లు తెరవడం ఎలా అని నేను ముగ్గులు వేసి చూపిస్తాను.  నా ముగ్గులను మీరు అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. 

1) 



2)   

Previous
Next Post »