మా తీర్థయాత్రలు

                                     ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

                  మేము కుటుంబ సమేతంగా తిరుపతి చూడాలని అనుకున్నాము అలాగే చుట్టుపక్కల ఉన్న పుణ్యక్షేత్రాలు కూడా చూడాలి అని మా పిల్లలు చాలా సరదా పడ్డారు. ఒక మంచి రోజున వెహికల్ మాట్లాడుకుని ఇంటి నుంచి రాత్రి 7 గంటలకు బయల్దేరాము మేము వెళ్ళే దారిలో ఆంజనేయ స్వామి వారి గుడి ఉంది అక్కడ స్వామివారికి  బట్టలు , తమలపాకులు, ఆకు పూజకి ఇచ్చి స్వామి దర్శనం చేసుకొని రాత్రి భోజనాలు కానిచ్చుకొని అక్కడి నుంచి బయలుదేరాము.  

                  తెల్లవారు జామున నాలుగు గంటలకు తిరుపతిలో అలిపిరి వద్దకు చేరుకున్నాము. అక్కడ స్నానాలు అవి చేసుకుని కాఫీ తాగి, వెహికల్ లోబయలుదేరపోతుండగా ఆ చల్లని వాతావరణం ప్రకృతి సౌందర్యం చూసి నాకు వెహికల్ లో  వెళ్లాలని అనిపించలేదు.  ప్రకృతి సౌందర్యాన్ని తనివితీరా ఆస్వాదించాలనే కోరికతో నడక మార్గమున బయలుదేరాము. నేను పిల్లలు మెట్ల ద్వారా, మా వారు కారులో బయలుదేరాము. ముందుగా అలిపిరి మెట్ల వద్ద ఉన్న వినాయకుడి కి నమస్కారం చేసి నడక ప్రారంభించాము.  అటుఇటు చెట్లతో నిండిన పచ్చని ప్రకృతిని చూస్తూ, స్వామినామాలు జపం చేసుకుంటూ నడక మొదలు పెట్టాము. అలసట అనేది మా దరిదాపులకి రాలేదు, సంతోషం తప్ప. అది స్వామి మహిమే కదా!  కొంతసేపు నడక తరువాత జింకల పార్క్ వస్తుంది.  మా పిల్లలు వాటికి క్యారెట్ , కీరా, ముల్లంగీ కొని వాటికి తినిపించారు.  నేను విశ్రాంతిగా అవి అన్ని చూస్తూ కూర్చున్నాను.  ఆ తర్వాత మరల కొంచెం దూరం వెళ్ళాక ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. అక్కడ స్వామి దర్శనం చేసుకుని ముందుకు నడిచాము. ఉదయం 10 గం. కొండపైకి చేరుకున్నాము. కాని మెట్ల మార్గములోని ప్రకృతి సౌందర్యం ఎంత సేపు చూసినా తనివి తీరదు.  ఆ తర్వాత రూంకి వెళ్లి రెస్ట్ తీసుకుని స్వామి దర్శనానికి వెళ్ళాము. ఆ స్వామి దయ వల్ల చాలా దగ్గరగా స్వామిని కన్నులారా తనివితీరా దర్శించుకున్నాము.

 ఆ తరువాత ఇంకా అక్కడ సహజ శిలా తోరణం, స్వామి పుష్కరిణి, పాపవినాశనం మాత్రము చూసాము. ఇంకా చాలా ఉన్నాయి కాని సమయం లేదు అని కిందకు బయల్దేరాము, నేరుగా తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నాము. అక్కడి నుంచి సుమారు రెండు గంటల ప్రయాణం చేసి కాణిపాకం చేరుకున్నాము. అక్కడ  కోనేటిలో కాళ్ళు చేతులు కడుక్కుని స్వామి దర్శనానికి వెళ్ళాము.  ఆ స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిశాడు.

  ఈ గుడి 11వ శతాబ్దంలో చోళ రాజులు నిర్మించారు. చిత్తూరు నుంచి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. తనివితీరా స్వామి దర్శనం చేసుకుని అక్కడి నుంచి దగ్గరలో ఉన్న అర్ధగిరి ఆంజనేయస్వామి గుడిని చూడాలని బయలుదేరాము.

 ఆ ఊరు పేరు అరకొండ. అక్కడికి చేరుకునే సరికి రాత్రి పది గంటలు అయింది. అక్కడ ఒక రూం తీసుకుని మరుసటి రోజు ఉదయాన్నేస్వామి దర్శనానికి బయల్దేరాము.  ఆ స్వామి వెలసింది కొండమీద. ఆ కొండ పేరు అర్ధగిరి.  పూర్వం త్రేతాయుగంలో ఆంజనేయ స్వామి లక్ష్మణుడి కోసం సంజీవని పర్వతం తీసుకుని వస్తుండగా ఆ పర్వతం నుంచి సగం ముక్క అక్కడ పడింది. అందుకని ఆ పర్వతాన్ని" అర్ధగిరి కొండ " అని అంటారు. అక్కడి  కోనేటిలో నీరు త్రాగితే మనకు ఉన్న అనారోగ్యాలన్నీ ఆ స్వామి దయ వల్ల మటుమాయం అవుతాయి. నేను కూడా ఒక బాటిల్ నిండా నీరు తెచ్చుకున్నాను.  ఆ తర్వాత కొండ నుండి క్రిందకు వచ్చి చిత్తూరు  మీదుగా తిరుత్తణి వెళ్ళాము.      

ఆ స్వామి గుడి కూడా  కొండ మీదనే ఉన్నది.  అక్కడ సుబ్రమణ్య స్వామి, వల్లి  సమేతంగా దర్శనమిస్తారు.  అక్కడి స్వామి ప్రసాదం చాలా బాగుంటుంది. అది ఎలాగంటే ఒక ఆకులోపల ప్రసాదాన్ని ఉంచుతారు. ఆకుతో అలాగే ఇస్తారు. ఎన్ని ఆకులు కావాలంటే అన్ని తీసుకోవచ్చు. చాలా చాలా రుచిగా ఉంటుంది. నేను కొంత ప్రసాదం ఇంటికి కూడా తెచ్చుకున్నాను. స్వామి దర్శనం తరువాత  కొండ కిందకు  వచ్చి అక్కడ నుంచి కంచి కి బయలుదేరాము.

 అక్కడ శివకంచి, విష్ణుకంచి అని రెండు గుళ్ళు ఉన్నాయి. రెండు గుళ్ళలో దర్శనం చేసుకున్నాము. విష్ణు కంచిలోని బంగారు బల్లి ఉంది. అన్ని చూసుకుని హోటల్లో భోజనం చేసి ఇంక తిరుగు ప్రయాణంలో " కాళహస్తి "  దగ్గర ఆగాము. అక్కడ శివ దర్శనం చేసుకున్న తరువాత ఇక్కడ కొండమీద పూర్వకాలం నాటి శివాలయం ఉంది. ఆ గుడిలో జరిగిన సంఘటనవలనే ఆ వూరికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది. " శ్రీ " అంటే సాలెపురుగు, ఆ శివాలయంలో ఒక సాలీడు నిండు భక్తితో శివునికి గూడు కడుతుంది. శివుడు దాని భక్తిని పరీక్షించడానికి, ఆ గుడు కాలిపోయేలా చేస్తాడు. అది చూసి ఆ సాలీడు బాధతో ఆ మంటల్లో పడి మరణిస్తుంది. శివుడు దాని భక్తికి మెచ్చి దానికి ముక్తిని ప్రసాదిస్తాడు. కొన్నాళ్ల తరువాత రోజూ ఒక ఏనుగు తన తొండముతో నీటిని తీసుకొని వచ్చి శివలింగానికి అభిషేకం చేసి పూలతో పూజించేది.  ఏనుగును (హస్తి) అని కూడా అంటారు.  ఆ తర్వాత ఒక సర్పం అక్కడకు వచ్చి ఏనుగు చేసిన పూజను తీసివేసి తను తెచ్చిన మణి తో పూజించేది. మరుసటి రోజు ఏనుగు వచ్చి చూడగా తను చేసిన పూజను నెట్టి వేసి ఇంకెవరో పూజ చేస్తున్నారని గ్ర హించి అది ఎవరో  తెలుసుకోవాలని  చాటుగా మాటు వేసి  గమనిస్తుంది. తన పూజను పాడు  చేసింది  పాము అని తెలుసుకొని  దానిని ఎలాగైనా చంపాలని ఆ మరుసటి రోజు  తను పూజ పూర్తి చేసుకొని పాము కోసం ఎదురు చూస్తుంది. ఆ పాము కూడ తన మణితో చేసే పూజను ఎవరో పాడు చేస్తున్నారని తెలుసుకొని , మాటు వేసి చూస్తుంది. రెండు ఎదురుపడతాయి కోపంతో. ఏనుగును చూడగానే ఎలాగైనా దానిని చంపాలని పాము దాని తొండంలోకి దూరుతుంది. అప్పుడు ఏనుగు పామును చంపాలని కోపంతో తన తొండాన్నివృక్షానికేసి బాదుకుంటుంది. ఆ దెబ్బలకు  తొండములో వున్న పాము చనిపోతుంది. పాము లోపల వుండటం వల్లన ఊపిరి ఆడక ఏనుగు, పాము  రెండు ఒకేసారి చనిపోతాయి.  అప్పుడు శివుడు  వాటి భక్తికి మెచ్చి వాటికి మోక్షము ప్రసాదిస్తాడు.  అప్పటినుంచి ఆ ఊరికి  శ్రీ - సాలీడు,కాళ - పాము,హస్తి - ఏనుగు, శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది.  శ్రీకాళహస్తి  " సువర్ణముఖి "నదీ తీరంలో ఉన్నది. 

ఇంక క్రిందకు దిగి వచ్చి మరలా బయల్దేరాము, తెల్లవారుజామున నాలుగు గంటలకు మా ఇంటికి చేరుకున్నాము. మనసుకు ఆహ్లాదాన్నీ పెంచే ఇలాంటి కుటుంబ సమేత ప్రయాణాలు చాలా సంతోషాన్ని ఇస్తాయి. 

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు , ఆపద్బాంధవుడు, అనాధ రక్షకుడు పిలిస్తే పలికే ప్రత్యక్షదైవం అందరిని చల్లగా కాపాడుతాడు. ఇంత దూరం తిరిగిరావడానికి ఆ స్వామి అనుగ్రహమే కారణం. 

         ఓం నమో వెంకటేశాయ !!!

---------------------------------------------------------------------------------------------

ఈ వారం చిట్కా :-

ఈవిధముగా వ్రాసుకుంటే తెల్లజుట్టు నల్లగా మరుతుంది సహజమైన పద్ధతిలో:-  
              
        ఒక గిన్నె తీసుకొని , ఒక గ్లాస్ నీళ్ళు పొసి స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి. నీరు వేడి ఎక్కగానే అందులో 1 చెంచా కాఫీ పౌడర్, 1 చెంచా టీ పౌడర్, 1 చెంచా త్రిఫల చూర్ణం పౌడర్ వేసి బాగా మరిగించాలి. 1/2 గ్లాసు నీరు అయిందాక మరగనిచ్చి, దించి వడ కట్టుకోవాలి. వడ కట్టిన దానిని పక్కన ఉంచాలి. అది చల్లారిన తరువాత తలకి సరిపడ కావలసినంత  గోరింటాకు తీసుకొని, కాచి చల్లార్చిన నీటిని పొసి మిక్సి పట్టాలి. ఈ మిక్సి పట్టిన దానిని తలకు బాగా పట్టించాలి. కనీసం 6 గం. ఉంచుకొని తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేయండి. మీ జుట్టు నల్ల బడుతుంది. దీనిని చేతులకు కూడ పెట్టుకోవచ్చు. గోళ్ళు కూడ బాగా పండుతాయి. 


Previous
Next Post »

1 Comments:

Click here for Comments
Unknown
admin
11 అక్టోబర్, 2020 11:26 PMకి ×

Very Nice explanation Madam

Congrats bro Unknown you got PERTAMAX...! hehehehe...
Reply
avatar