శబరిమల స్థల పురాణం

                     

                                   ఓం శ్రీ మహాగణపతయే నమః 

                    పూర్వం మహిషి అనే రాక్షసి బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేసెను. ఆ రాక్షసి  భక్తికి మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయి " ఓ మహిషీ, నీకు ఏమి వరం కావలయునో, కోరుకొనమని పలికెను.  అంతట మహిషి " నాకు అమరత్వం ప్రసాదించమని పలికెను.  అంత విధాత చిరునవ్వు నవ్వి, అది అసంభవం, జనన, మరణాలు సహజం. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. ఇంకేమైనా వరం కోరుకొమ్మని చెప్పను. అంతట మహిషి " బ్రహ్మదేవా ! నాకు హరి, హరుల సంగమంలో జన్మించిన  బాలుని వలనే నాకు మరణం సంభవించవలెను. ఆ వరం ప్రసాదించు విధాత అని కోరుకొనెను. అంతట బ్రహ్మ దేవుడు " తధాస్తు " అని వరమిచ్చెను.  ఆ వరప్రభావముతో మహిషి  భూలోకములోని మునులను వారి యజ్ఞాలను నాశనం చేసి, ఆ పై దేవలోకము పై దండెత్తెను.  ఆ మహిషి ధాటికి భయపడి ఇంద్రాది దేవతలు స్వర్గమును వదిలి పారిపోయారు. వారు పారిపోవుచుండగా, వారికి నారదుడు ఎదురుపడి " భయంవలదు, మీకు నేను మార్గం చూపుతాను అని పలికి బ్రహ్మదేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళాడు.  అందరు కలసి బ్రహ్మదేవుని  ప్రార్దించగా,  అంతట బ్రహ్మ వారిని ఊరడించి " దేవతలారా ! మీకు నేను ఒక ఉపాయం చెప్తాను. అప్పుడు మీ కష్టాలన్నీ తీరుతాయి, అని పలుకగా, " వాణీ వల్లభా " ఆ మార్గమేదో సూచించండి అని ప్రార్ధించగా, శివ కేశవుల సంగమము వల్ల కలిగిన పుత్రుని వల్లన్నే మహిషి మరణం సంభవం.  మీరు వెళ్లి కైలాసనాధుని ప్రార్ధించండి, మీకు శుభం కలుగుతుంది  అని వారికి ధైర్యం చెప్పి పంపించాడు.  అప్పుడు దేవతలందరూ కలసి కైలాసమున శివుని దర్శించి తమ భాధలను విన్నవించుకుని, తమని కాపాడమని వేడుకున్నారు. అంత శివుడు వారికి అభయమొసంగీ తాను వైకుంఠమునకు వెళ్లి హరితో అన్ని విషయములను విశపరిచెను. లోకకళ్యాణం కోసం ఇప్పటికే రెండు మార్లు మోహిని అవతారం ఎత్తాను. ఇంక మూడవసారి కూడ మోహినిగా మారుతాను, అని హరి, శివుని చూసి చిద్విలాసంగా నవ్వాడు.

తరువాత మోహిని శివుడితో కలసి విహరించాడు. వారివురి కలయుకవల్ల ఒక బాలుడు ఉదయిస్తాడు. ఆ బాలుడు పందళ రాజ్యంలోని పందళరాజు " రాజశేఖరు " నికి  పంపానది ఒడ్డున కనిపిస్తాడు. బిడ్డలు లేని ఆ రాజు ఆ బాలుని భగవంతుడిచ్చిన వరప్రసాదంగా భావించి, రాజ్యానికి తీసుకెళ్ళి రాణికి ఇచ్చి అపురూపముగా పెంచుతారు. మెడలో మణిమాలతో దొరికాడు కాబట్టి అతనికి " మణికంఠుడు " అని నామకరణం చేసి,  విద్యాభాస్యం కోసం గురుకులానికి పంపుతారు. గురుకులం నుండి వచ్చిన మణికంఠుడికి పట్టాభిషేకం చేయాలని రాజు, రాణి అనుకుంటారు. కాని మణికంఠుడు మహిషి సంహారం కోసం జన్మించినవాడు, అతనికి పట్టాభిషేకం జరుగరాదు. ఇందుకు దేవేంద్రుడు, నారదుడు కలసి మహారాణికి విపరీతమైన శిరోవేదన వచ్చేలాగ, రాజవైద్యులెవరూ ఆ శిరోవేదనకు మందులేదు, అనే లాగ చేసి, వారిరువురు వైద్యులుగా మారి రాజ మందిరానికి వచ్చి, మహారాణి తలనొప్పికి మందు ఇచ్చి నయం చేస్తామని చెబుతారు.  రాణిని పరిక్షించి " పులిపాలు " తీసుకుని వచ్చి పట్టు వేస్తేనే శిరోవేదన తగ్గుతుంది , అని సెలవిస్తారు.  అది విని మణికంఠుడు  తాను అడవికి వెళ్లి పులి పాలు తీసుకొని వస్తానని, చెప్పి అడవికి వెళ్తాడు.  అక్కడ మహిషిని చూసి మహిషితో యుద్ధం చేసి మహిషిని సంహరిస్తాడు. అప్పుడు దేవతలంతా పుష్ప వర్షం కురిపించి మణికంఠుడుని ఆశీర్వదిస్తారు. అప్పుడు దేవేంద్రుడు పులిలాగ  తాను వస్తానని తన మీద స్వారి చేసి రాజ మందిరానికి వెళ్లి పాలు తీసుకోమని చెపుతాడు.  సరేనని మణికంఠుడు పులి మీద ఎక్కి రాజమందిరానికి  వెళ్ళగా , రాణి తలనొప్పి తగ్గిపోయింది . ఇంకా పులిపాలు అవసరము లేదు, అనగా పులిని పంపివేస్తాడు.


   అప్పుడు తండ్రి ఇకనైనా పట్టాభిషేకం ముహూర్తం చూడమని పండితులకు చెప్పగా, అప్పుడు మణికంఠుడు తండ్రీ ! మహిషి సంహారం కోసం హరిహరసుతుని గా జన్మించెను.  ఆ మహిషి సంహారం పూర్తి అయింది .  ఇంకా నా భాద్యత పూర్తి కాలేదు. శబరిమల కొండ మీద వెలసి భక్తుల అభీష్టాలు నేరవేర్చాలి. నన్ను ఆశీర్వదించి పంపండి అని అనగా " నాయనా ! నీవు మాకు ఎంత దూరంలో ఉంటావు. నిన్ను చూడాలంటే మేము ఎలా చూడాలి అని అడగగా,  నేను ఒక బాణం వేస్తాను. అది  ఎక్కడ పడుతుందో అక్కడ నాకు గుడి కట్టించండి అని పలికి విల్లు ఎక్కు పెట్టి బాణం వేస్తాడు.  ఆ బాణం అడవిలో ఒక కొండమీద పడుతుంది . ఆ కొండ ఎవరోకాదు, త్రేతాయుగంనాటి శబరి. ఆ కొండ మీదనే పందళరాజు గుడి కట్టిస్తాడు. స్వామి అక్కడే వెలుస్తాడు. ఆయన్నే శబరిమల సాస్తా అంటారు. 

శబరిమల దర్శనానికి అన్నిరాష్ట్రాల నుంచి బస్సులు, రైళ్ళు కలవు. సొంత వాహనములలో కూడా చేరుకోవచ్చును. ఎరుమేలి నుంచి యాత్ర ప్రారంభమవుతుంది . శబరిమల యాత్ర  మధురానుభూతులన్నీ కలిగిస్తుంది .  మొదట వావర్ స్వామిని దర్శించుకొని, ఎరుమేలిలో ధర్మశాస్త ని దర్శించుకొని అక్కడి నుండి పంబకు వెళ్తారు.  వెళ్ళే మార్గమంత చెట్లు, లోయలతో నిండిన అడవి మార్గం.  దీనిని పెద్ద పాదం యాత్ర అంటారు. తరువాత నీలిమలై అంటారు.  మార్గమంత చాలా కష్టతరంగా సాగుతుంది. కాని స్వామివారి నామస్మరణతో ఆ కష్టం, కష్టముగా అనిపించదు. మార్గం సుగమవుతుంది . పంబలో స్నానం చేసి దర్శనానికి బయలుదేరుతారు. ఆ స్వామి దర్శనం అయిన తరువాత మనం పడ్డ బాధలేమి గుర్తుకురావు.  ఆ అడవి మార్గములో నడిచే దారిలో ఉచిత అన్నదాన సత్రాలు, హోటళ్లు ఉంటాయి.  అన్నదాన సత్రములో  ఉప్పుడు బియ్యంగంజి, చీనితో కూరలాగ చేసి పెడతారు.  ఆ చీని చాలా  స్టార్చ్ తో నిండిన ఆహారం. చాలా రుచిగా ఉంటుంది. 

ఒక్కసారి పది మంది శబరిమల దర్శనానికి బయలుదేరుతారు. వాళ్ళలో ఒకతను సుబ్రమణేశ్వర స్వామి భక్తుడు. అదే మొదటిసారి అయ్యప్ప దర్శనానికి రావడం. కొంత దూరం వెళ్లేసరికి అతను కొంచం వెనుకబడ్డాడు. మిగిలిన వారుముందుకు వెళ్లిపోయారు.  కొంతదూరం వెళ్ళగానే పులి గాండ్రింపు వినిపించింది.  దానితో భయంవేసి అతను ఆగి చుట్టూ చూడగా పెద్దపులి ఒకటి అతని పైన దూకటానికి సిద్దంగా ఉంది.  అతనికి ఏమి చెయ్యాలో తోచక భయంతో " వేలాయుధా " అని కళ్ళు మూసుకున్నాడు. అంతలో ఒక శూలం వచ్చి పులిని చంపివేసింది. అది మురుగన్ శూలం. అంతలో ముందుకు వెళ్ళిన వారంతా వెనక్కి వచ్చిచూడగా మరణించిన పులి కనిపించింది. వారంతా ఆశ్చర్యపోయి చూస్తుండగా ఒక చిన్న బాలుడు అక్కడికి వచ్చి " ఇక్కడకి వచ్చేవారు అయ్యప్పనే కొలవాలి. అంతేకాని వేరే దైవాన్నితలవకూడదు " అని పలికి మాయమయ్యాడు. చూసారా ! స్వామి మహిమలు,  ఇలాంటివి ఎన్నో....

స్వామియే శరణం అయ్యప్ప

హరిహర సుతనే శరణంఅయ్యప్ప

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకనే శరణం అయ్యప్ప. 


ఈ వారం చిట్కాలు :-

1)  కళ్ళలోని ఎరుపు తగ్గాలంటే :-
దోసకాయ గుజ్జును కంటి రెప్పలికి పూసుకుంటే, కంట్లోని ఎర్రుపు తగ్గి కళ్ళు చల్లగా ఉంటాయి. 
2) లావు తగ్గటానికి :- 
లావు తగ్గి సన్నబడాలంటే రోజు మధ్యాహ్నం అన్నం తినేందుకు ఒక గంట ముందర , తిన్నాక ఒక  గంట తరువాత  ఒక కప్పు నీళ్ళలో నిమ్మరసం కలుపుకొని త్రాగాలి. అందులో ఉప్పు, చెక్కర, తేనె   ఏమి వేయకుండా తాగాలి. 
3) జలుబు, ఒళ్ళునొప్పులు తగ్గాలంటే:-
తులసి ఆకులు,మిరియాలు కలిపి చిన్న ఉండలాగ చేసి తింటే, ఒళ్ళు నొప్పులు, జలుబు త్వరగా తగ్గుతాయి. 


Previous
Next Post »

1 Comments:

Click here for Comments
Ram
admin
4 అక్టోబర్, 2020 3:30 PMకి ×

👏👏👏👏

Congrats bro Ram you got PERTAMAX...! hehehehe...
Reply
avatar