40 సంవత్సరముల క్రితం మేము కేరళ చూడాలని మద్రాసు ఎగ్మూరు స్టేషన్ లో రాత్రి 7 గoటలకు రైలు ఎక్కాము. " ఎగ్మూరు " స్టేషన్ చాలా అందముగా ఉంటుంది. మరుసటి రోజు రాత్రి 8 గoటలకు త్రివేండ్రం సెంట్రల్ స్టేషన్ కి చేరుకున్నాము. ఈ రైలు తమిళనాడు లోని ముఖ్యమైన ఊర్ల నుండి వెళుతుంది. తిరుచురాపల్లి అనే వూళ్ళో మంచి స్వచ్చమైన ఆవు పాలు దొరుకుతాయి, చాలా రుచిగా ఉంటాయి. దిండిగ్గల్ స్టేషన్ లో టిఫిన్ చాలా బాగుంటుంది. ఆ తరువాత " మదురై" స్టేషన్ వస్తుంది. మదురై గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. మదురై గుడి గురించి అందరు వినే వుంటారు. మదురై లో అమ్మవారి పేరు " మీనాక్షి దేవి", స్వామి వారి పేరు " సుందరేశ్వరుడు ". మధురైను పాండ్యులు పరిపాలించారు. అక్కడ ద్రవిడ సంస్కృతిని పాటిస్తారు. అక్కడ రకరకాలైన పూలు దొరుకుతాయి. రంగురంగుల పూలతో, చిన్న పిల్లలకు ఒక రకం, ముడి వేసుకునే వారికి ఒక రకం, జడలు వేసుకునే వారికి ఒక రకం, వివిధ రకములుగా మాలలు కట్టి తీసుకువస్తారు. రాజపాళ్యం అనే వూళ్ళో బ్యాండేజీ క్లాత్ తయారి ఫ్యాక్టరీస్ కి పెట్టింది పేరు. తరువాత స్టేషన్ కడయనల్లూర్, అక్కడ ద్రాక్ష పండ్లు బాగా దొరుకుతాయి. తరువాత స్టేషన్ తెంకాసి . తెంకాసి జలపాతాలకి పెట్టింది పేరు. తరువాత స్టేషన్ సెంగోట్టై. ఇది దక్షిణ తమిళనాడు మరియు కేరళ రాష్త్రములకు సరిహద్దులో ఉంటుంది. ఇక్కడ స్టేషన్ లో భోజనము చాలా స్పెషల్, కావాలని అక్కడ దిగి భోజనము చేస్తారు. అరటి ఆకులు వేసి చాలా రకాల కూరలతో కొబ్బరి కూరలతో చాలా రుచిగా ఉంటుంది. తినాలే గాని ఆ రుచినిని వర్ణించలేము. తరువాత స్టేషన్ పున్నలూరు. పున్నలూరుని " Hill City " అని కూడా అంటారు. అక్కడ గుహలు చాలా ఎక్కువ, రైలు ఆ గుహల గుండా వెళుతుంది. అక్కడ 1877 లో బ్రిటీష్ వాళ్ళు కట్టిన ఒక ప్రాముఖ్యత చెందిన బ్రిడ్జి ఒకటి ఉంది. దానిని " London Bridge of Kerala " అని కూడా అంటారు.
తరువాత " Kollam " స్టేషన్ వస్తుంది. " Kollam " ఊరుని ఒక్కప్పుడు " Quilon " అనే వాళ్ళు. జీడిపప్పు కి చాలా ప్రసిద్ధి ఇక్కడ. కొబ్బరి పీచుతో తయారు చెసే అన్ని వస్తువులకు కొల్లం చాలా ఫేమస్. కొల్లం బ్యాక్ వాటర్స్ కి చాలా ఫేమస్. మంచి అందమైన టూరిస్ట్ ప్లేస్ అది. ఆ ఊరికి ఒక సామెత గూడ ఉంది. అది ఏమిటంటే " కొల్లం కండాల్ ఇల్లం వేండా " అంటే " కొల్లం అందం చూస్తే ఇల్లు కూడా గుర్తుకు రాదు " అని అంటారు. తరువాత " హరిప్పాడ్ " అనే స్టేషన్ , ఆ వూరిలొ భగవతి అమ్మవారి గుడి, సుబ్రహ్మన్యేశ్వర స్వామి గుడి ఉన్నాయి. ఇది కాకుండా చాలా ఫేమస్ అయిన నాగరాజా గుడి " మన్నార్‌శాల " ఉంది. తరువాత త్రివేండ్రం స్టేషన్ లో దిగి సంతోషముగా ఇంటికి వెళ్ళాము.
మరుసటి రోజు ఉదయానే " త్రివేండ్రం జూ " చూడటానికి వెళ్ళాము. కేరళ లో అతి పెద్ద జూ ఇది. 1857 వ సంవత్సరములో దీనిని ప్రారంబించారు. త్రివేండ్రం రైల్వే స్టేషన్ మరియు బస్ స్టాండ్ నుంచి కేవలం 4 కిలో మీటర్స్ దూరములో ఉంది. ఈ జూ 50 ఎకరాల విస్తిర్ణం లో వుంది. ప్రపంచములోని వివిధరకములైన జంతువులను ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ " Naiper museum మరియు బొటానికాల్ గార్డెన్ కూడా చూడవచ్చు.
సాయంత్రము " కోవళ్ళం బీచ్ " చూడటానికి వెళ్ళాము. అక్కడ 3 బీచ్ లు ఉన్నాయి. 1) లైట్ హౌస్ బీచ్ 2) హవా బీచ్ 3) సముద్రా బీచ్ అని మూడు బీచ్ లు ఉన్నాయి. ఈ బీచ్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచి మరియు ప్రకృతి సౌందర్యము తో అలరారుతుంది. టూరిస్ట్ ఇక్కడికి బాగా వస్తారు.
మరుసటి రోజు గుళ్ళు చూడటానికి బయలుదేరాము. ముందుగా అక్కడ బాగా ప్రసిద్ధ్హి గాంచిన వినాయకుడి గుడికి వెళ్ళాము . ఆ గుడి పేరు " పజ్ఘ్వంగది మహా గణపతి టెంపుల్ " అంటారు. ఇది ఈస్ట్ ఫోర్ట్ లో ఉంది. ఇక్కడ భక్తులు వారి యొక్క మొక్కులు తీర్చుకొనుటకు కొబ్బరికాయలు కొడతారు. 11,21, 51,101 ఇలా ఎవరికీ తోచిన విధముగా వాళ్ళు మొక్కుకొనీ కొబ్బరికాయలు కొడ్తారు. కోరిన కోరిక తప్పకుండ నేరవేరుతుంది. మేము కూడా 101 కొబ్బరికాయలు కొట్టాము. ఇక్కడ గణపతి హోమం చేస్తారు, 32 ఆకారాల్లో వినాయకుడి ప్రతిమలు చూడవచ్చు. ఈ గుడి పద్మనాభ స్వామి గుడి దగ్గరలో ఉన్నది. ఇక్కడ దర్శనం అయిన తరువాత పద్మనాభ స్వామి గుడికి వెళ్ళాము.
అక్కడ స్వామి వారు ఆది శేషుడి మీద పవళించి ఉంటాడు. స్వామివారిని మూడు గదుల్లో చూడవచ్చు.
ఒక గదిలో శిరస్సు భాగము, రెండవ గదిలో మధ్య భాగము, మూడవ గదిలో పాదాలు ఉంటాయి. ఆ గుడి గోపుర౦ 100 అడుగులు ఉంటుంది. ఆ గుడిలో స్వామి వారి పేరు " అనంత పద్మనాభ స్వామి ", దేవి పేరు " శ్రీ మహాలక్ష్మీ తాయార్ ". అక్కడి పుష్కరణి పేరు " మత్స్య తీర్థం " అంటారు. ఇక్కడ స్వామి వారికి నైవేద్యంగా ఎర్రటి ఉప్పుడు బియ్యంతో చేసిన గంజి, ఉప్పు మామిడికాయ పెడ్తారు. పచ్చని చెట్లతో కనువిందు చేసే ప్రకృతి ఒడిలో వెలసిన ఈ స్వామివారిని తప్పక దర్శించాలిసిందే.
ఆ తరువాత ఆటుక్కాల్ భగవతి గుడికి వెళ్ళాము. అక్కడ భగవతి అమ్మ వారు కొలువయి ఉన్నది. వినాయకుడు, శివుడు, సుబ్రహ్మన్యేశ్వర స్వామి, నాగరాజు విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ అమ్మవారికి సంవత్సరములో ఒక్క సారి ఆడవాళ్ళంత పొంగళ్ళు సమర్పించుకుంటారు. మనం ఏదయీనా కోరిక నెరవేరితే పొంగళ్ళు పెడతాము అని మొక్కుకుంటారు. మేము 101 పొంగాళ్ళు వేశాము. ఇక్కడ భగవతి అమ్మవారు త్రిమాత కలయిక. ఇక్కడ దేవిని " అమ్మే నారయణ , దేవి నారాయణ, లక్ష్మీ నారాయణ, బద్రి నారాయణ " అని స్మరించుకుంటాము.
ఆ రోజు సాయంత్రము అక్కడ ప్రసిద్ధిగాంచిన మహాదేవుని క్షేత్రముకి వెళ్ళాము. ఇది పురాతనమైన శివుడి గుడి. 10వ శతాబ్ధములో నిర్మించబడింది. కేరళ రాష్ట్రములోని 108 శివుడి దేవాలయములో ఇది ఒక్కటి. ఈ గుడి త్రివేండ్రం రైల్వే స్టేషన్ నుంచి 13 కి మీ దూరములో మరియు ఎయిర్ పోర్ట్ నుంచి 11 కి మీ దూరములో ఉన్నది. ప్రతి సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో ఈ గుడిలో 10 రోజుల ఉత్సవాలు జరుగుతాయి.
ఇక్కడ వాతావరణము, ప్రకృతి అందాలు చూసి తీర వలసిందే తప్ప మాటల్లో వర్ణించలేము. ఇక్కడ వంటలన్నీకొబ్బరినూనె తో చేస్తారు. కొబ్బరినూనెను వంటికీ వాడ్తారు. అక్కడ వంటలన్నీకూడా కొబ్బరితో నే చేస్తారు. ఆ కొబ్బరితో చెసే వంటలన్నీ చాలా రుచిగా వుంటాయీ. ముందు ముందు
మీకు ఆ వంటలు కూడా పరిచయం చేస్తాను. అదీ గాక కేరళ ఆయుర్వేద వైధ్యానికి పెట్టింది పేరు.
మా సెలవులు అయిపోవటము వలన మేము కేరళ మొత్తం చూడలేకపోయాము. త్రివేండ్రంలో కొంత వరకు మాత్రమే చూసాము. ఈ ప్రయాణము మా మనస్సులో మరపురాని మధురానుభూతిగా నిలిచిపోయింది. అందుకే మీతో ఆ అనుభూతులను పంచుకుంటున్నాను.
3 Comments
Click here for CommentsExcellent
ReplyWonderful trip
Replykerala lo innni temples unay ani nak ipati daka telidu...nice information
ReplyConversionConversion EmoticonEmoticon