పోలి పాడ్యమి కథ

    కార్తీకమాసం ఇంకొక వారంలో పూర్తి అవుతుంది. కార్తీకమాసంలో స్నానం, దీపారాధన సమారాధనలు, ఇవి అన్నీ ఎంత ముఖ్యమో, కార్తీకమాసం అయిపోయిన తర్వాత (అమావాస్య) వచ్చే పాడ్యమిని పోలి పాడ్యమి  అంతకన్నా ముఖ్యం. కార్తికంలో స్నానాలు, జపాలు, దీపారాధనలు, ఏమి చేసినా, చేయకపోయినా పోలి పాడ్యమి రోజున మాత్రం తప్పక పూజ చేయాలి. ఇది చాలా ముఖ్యమైనది అని పెద్దలు చెబుతారు. 

   నిర్మలమైన భక్తితో మనం ఏ పని చేసినా అది మనకు విశేషమైన ఫలితం ఇస్తుంది. కార్తీకమాసం చివరిలో అందరికీ గుర్తుకు వచ్చేది  పోలి పాడ్యమి. మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున ఉదయాన్నే పోలి పాడ్యమి వ్రతాన్ని చేస్తారు. నిర్మలమైన మనసుతో, దృఢ సంకల్పంతో, భగవంతుని ఆరాధిస్తే స్వర్గలోకం (విష్ణు సానిధ్యం) చేరుకోవటం   అసాధ్యమేమీ కాదు అని నిరూపించే కథ పోలి పాడ్యమి కథ.   ఆ పూజా పద్ధతి, కథ, నాకు తెలిసినంతవరకు మీకు తెలియజేస్తాను.

 కథ:-   పూర్వం ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. వారికి ఐదుగురు కొడుకులు ఉన్నారు. వారందరికీ పెళ్లిళ్లు అయ్యాయి.  వారిలో చిన్న కోడలి పేరు పోలి. చిన్నతనం నుంచి మంచి గుణవంతురాలు. పూజలు అన్నా, వ్రతాలు అన్నా,  చాలా భక్తితో చేసేది. ఇంట్లో పనులు కూడా ఒకరితో వంతులు వేసుకోకుండా కష్టపడి, ఒళ్ళు వంచి, పని చేసేది. ఆ ఊరి వాళ్ళు అందరు కూడా పోలి మంచితనాన్ని మెచ్చుకునేవారు. అందరికీ తలలో నాలుకలాగా  మసలు కునేది.   కానీ పోలి అత్తగారు, తోడికోడళ్ళు పోలి తోనే పనులను చేయిస్తూ బాధపెడుతుంటారు.

   పోలి అత్తగారు, తోడికోడళ్ళు, వాళ్ల గొప్ప భక్తులు గా పేరు సంపాదించుకోవాలని కోరికతో, అత్త, నలుగురు కోడళ్ళు నదికి వెళ్లి స్నానం చేసి దీపాలు వెలిగించుకునేవారు. కార్తీక మాసము నెలరోజులూ వాళ్లు మాత్రమే అలా చేసే వాళ్ళు. పొలికి బండెడు పని అప్పగించి వెళ్లేవారు. పోలి ఏ మాత్రము విసుగు చెందక పని మొత్తం పూర్తి చేసుకుని, బావి దగ్గర స్నానం చేసి దీపం వెలిగించేది. అలా నెల రోజులు పూర్తి అవుతాయి. తర్వాత కార్తీక అమావాస్య వచ్చింది. ఆరోజు పోలి దీపాలు వెలిగించకూడదనే ఉద్దేశంతో నూనె వత్తులు ఏవి పోలికి అందుబాటులో లేకుండా అన్ని దాచేసి, తన నలుగురు కోడళ్ళని  తీసుకొని నదీ స్నానానికి వెళ్ళింది. పొలి ఇంటిలోనే నూతి వద్ద స్నానం చేసి, చల్ల కవ్వంలోని వెన్నను తీసి, పెరట్లోని పత్తి చెట్టు నుంచి పత్తిని తీసి, వత్తి చేసి, దీపం వెలిగిస్తుంది.  దీపం వెలిగించి, అది అత్తగారి కంట పడకూడదని దాని మీద ఒక బుట్టను బోర్లించి ఉంచుతుంది.  ఏ అవకాశాలు లేకపోయినా పట్టుదలతో, నిష్టగా పోలి చేసిన కార్తీక స్నానం, దీపారాధన అన్నీ విష్ణుమూర్తి మనసును తాకింది. 

 విష్ణుమూర్తి విష్ణుదూతలను పిలిచి పోలిని బొందితో స్వర్గానికి తీసుకురమ్మని, పుష్ప పుష్పక విమానం పంపుతాడు. పోలి విమానం ఎక్కే సమయానికి అత్త, తోడికోడళ్ళు ఇంటికి తిరిగి వస్తారు.  రోజు నదీ స్నానం చేసి, భక్తిగా దీపాలు వెలిగించిన మాకు లేకుండా పోలికి విమానం రావటం ఏంటని, వాళ్ళు విష్ణు దూతలను ప్రశ్నించగా, అప్పుడు విష్ణుదూతలు, ' నిశ్చలమైన భక్తితో చేసే ఏ పూజ అయినా భగవంతునికి చేరుతుంది. భక్తితో స్వామికి సమర్పించే ఫలమైన, పత్రమైనా, తోయమైనా, ఆ పరమాత్ముడు సంతోషంగా స్వీకరిస్తాడు',  అని పలికి విష్ణుదూతలు వెళ్లిపోతారు. 


 అప్పుడు పోలి అత్తగారు, తోడికోడళ్ళు, వాళ్ల తప్పు తెలుసుకుని ఆ దామోదరుని పశ్చాత్తాపంతో క్షమించమని వేడుకుని వాళ్లు కూడా ఆ స్వామిని భక్తితో పూజించడం మొదలు పెడతారు. ఈ కధ వలన నారి అంటే స్త్రీ,  స్త్రీ శక్తి తలుచుకుంటే ఏ పని అయినా సాధిస్తుంది. స్త్రీ చేసే పనికి తిరుగులేదు, అని మనం అర్థం చేసుకోవాలి. మనిషికి కావాల్సింది, ఆడంబరాలు,  ఆర్భాటాలూ కాదు నిర్మలమైన మనస్సు.


 పూజా విధానం:-    మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ ముహూర్తంలో లేచి తలస్నానం చేసి తులసి కోట వద్ద శుభ్రం చేసి ముగ్గులు వేసుకోవాలి ఆ తర్వాత దేవుని ముందు దీపం వెలిగించి ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేయాలి ఆ తరువాత తులసికోట వద్ద కూడా దీపం వెలిగించి పూజ చేసుకోవాలి. 

 ఆ తరువాత ఒక పెద్ద బేసిన్ నిండా నీరు తీసుకొని దానిలో కొంచెం పసుపు, కుంకుమ, పూలు, అక్షింతలు వేసి " గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు " అని ప్రార్థన చేసుకోవాలి.  ఆ తరువాత ముందు రోజున అరటి దొప్పలు సిద్ధం చేసుకోవాలి.  ఆ దొప్పలు తీసుకుని దానికి పసుపు, కుంకుమ బొట్టు పెట్టి, దానిలో ఆవు నెయ్యి వేసి, కుంభ వత్తులు వేసి వెలిగించాలి.  ఆ వత్తులు బేసి సంఖ్యలో ఉండాలి.

 అలా దొప్పలలో దీపం వెలిగించి, నిండుగా నీరు నింపిన  బేసిన్లో  దొప్పలను వదలాలి. తరువాత వాటిని చేతితో మూడు మార్లు ముందుకు తోయాలి.  తరువాత చలిమిడి, అరటి పండ్లు, వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించాలి.  ఒక ముత్తైదువకు జాకెట్ ముక్క, తాంబూలం పెట్టి ఇవ్వాలి.  ఈ నెల రోజుల కార్తీక స్నానం, దీపారాధన, పోలి పాడ్యమి అన్ని ముగిసిన తరువాత ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలం ఇచ్చి నమస్కరించాలి.

 ఈ కథ వల్ల మనకు అర్థం అయ్యింది ఏమిటంటే నిర్మలమైన మనస్సుతో పట్టుదలతో, భక్తితో చేస్తే ఏ పని అయినా స్త్రీ సాధించగలదు. 

  సకలం శ్రీమన్నారాయణేతి సమర్పయామి !!!

-------------------------------------------------------------------------------------------------------

 ఈ వారం చిట్కా:-

 పళ్ళు తళతళ లాడాలంటే:-    నేను రాసేది పూర్వ రోజులది మా ఇంట్లో వాడింది. అదే మీకు తెలియజేస్తున్నాను.

 బియ్యం మిల్లు లో వరిపొట్టు దొరుకుతుంది. దాన్ని తీసుకువచ్చి రాళ్లు, రప్పలు, చెత్త చెదారం లేకుండా శుభ్రం చేసి బాండీలో వేసి బాగా వేయించాలి. అది బాగా నల్లగా అవ్వాలి. తరువాత దానిని దించి, చల్లారనిచ్చి, దానిలో కల్లు ఉప్పు, (సరిపడా) కొంచెం మిరియాలు వేసి మిక్సీలో వేసుకుని పొడి చేసుకోవాలి. దానితో పండ్లు తోముకుంటే, గట్టిగా దృఢంగా ఉంటాయి. ముసలితనం వచ్చినా  పళ్ళు మాత్రం దృఢంగా ఉంటాయి.   పాత రోజుల్లో బజార్లో కూడా వీటిని అమ్మే వాళ్ళు.  కాకపోతే వాళ్లు దాంట్లో శాక్రిన్  అనే  పదార్థాన్ని కలుపుతారు.  అప్పుడు అది  రోజ్ కలర్ లో ఉంటుంది. ప్యాకెట్ 10 పైసలకి అమ్మేవాళ్ళు.








Previous
Next Post »