కార్తీక వ్రత ప్రభావం ఎంత విన్నా తనివి తీరదు. ఇంకనూ వివరించెదను, వినుము అని అత్రిమహాముని అగస్త్యునితో పలికెను. గంగా, గోదావరి నదుల్లో స్నానం చేయటం వలన, గ్రహణ సమయంలో స్నానం జప విధులు నిర్వహించడం వలన ఎంత పుణ్యం కలుగునో ఈ కార్తీకమాసమందు శ్రీమన్నారాయణునికి ప్రీతికరమైన శుద్ధ ద్వాదశీ వ్రతమును భక్తితో ఆచరించే వారికి అంతకన్నా వెయ్యిరెట్లు అధిక ఫలము కలుగును. ఈ ద్వాదశి వ్రతము చేయు విధానము ఇప్పుడు తెలుసుకుందాము.
కార్తీక శుద్ధ దశమి రోజున పగటి పూట మాత్రమే భుజించి ఆ మరుసటి దినము అనగా ఏకాదశి రోజున ఏ వ్రతమూ చేయక, పూర్తి ఉపవాసం ఉండి ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాత భుజించవలయును. దీనికి ఉదాహరణగా ఒక కధ తెలియపరుస్తాను.
పూర్వము అంబరీషుడు అనే రాజు ఉండేవాడు. అతను విష్ణుమూర్తి భక్తుడు. ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో ద్వాదశి వ్రతము తప్పక ఆచరిస్తాడు. ఒకసారి ద్వాదశి వ్రతము రోజున ద్వాదశి ఘడియలు స్వల్పంగా వుండెను. అందుకని ఆ రోజు త్వరగా వ్రతము ముగించి, బ్రాహ్మణ సమారాధన చేయవలెనని ఆశించేను అదే సమయంలో అచ్చటకు కోపస్వభావము కలిగియున్న దుర్వాసుడు వచ్చెను. అప్పుడు అంబరీషుడు ఆ మునిని గౌరవించి, ద్వాదశి ఘడియల్లో పారాయణము చేయవలయును, త్వరగా స్నానం చేసి రమ్మని కోరెను. దుర్వాసుడు దానికి సమ్మతించి స్నానమునకు నదికి వెళ్ళను. నదికి వెళ్ళిన దుర్వాసుడు ఎంత సమయము గడిచినను రాలేదు.
ద్వాదశి ఘడియలు దాటి పోతున్నాయి. అంబరీషుడు బాగుగా ఆలోచించి, పండితులను పిలిచి వారికి నేను ఇప్పుడు ఏమి చేయవలెను తెలుపమని కోరెను.
బ్రాహ్మణునికి పెట్టకుండా భుజించవచ్చునా ? లేక వ్రతభంగం చేసి ముని వచ్చే వరకు వేచి చూడనా ? ఈ రెంటిలో ఏది శ్రేష్టమైనది అని పలికెను. అప్పుడు ఆ పండితులు మహారాజా! శరీరమునకు శక్తినిచ్చివాడు అగ్నిదేవుడు, ఆ అగ్నిదేవుడు దేవతలకు అందరికంటే అధికుడు. ఆయనను సదా పూజించాలి. వేద వేదాంగాలు, చదివిన మహా తపశ్శాలి, సదాచారసంపన్నుడు అయిన దుర్వాసమునికి భోజనం పెట్టకుండా తినుట మహాపాపము కలుగును, అని పలికిరి. అది విని అంబరీషుడు ద్వాదశి వ్రతము విడిచిపెట్టుట కన్నా, మునిశాపం ఎక్కువ కాదు. అందుకని నేను జల పానం చేస్తాను. దీనివల్ల నా వ్రత భంగము కాదు, దుర్వాసమునికి కోపము రాదు, అని అనుకొని అంబరీషుడు ద్వాదశి ఘడియలలో జలపానము చేసేను. రాజు జలపానము చేసిన వెంటనే దుర్వాసుడు నది నుంచి తిరిగి వచ్చాడు. వచ్చిన వెంటనే కళ్ళ వెంట నిప్పులు కురుస్తుండగా ఓరి. మదాంధా! నేను రాకుండానే నీవు భుజించినావు, ఎంత నిర్లక్ష్యం, ఎంత దుర్మార్గము. అలాంటి వారు మరుజన్మలో పురుగై పుట్టును. శ్రీహరి భక్తులు ఎప్పుడూ బ్రాహ్మణులను అవమానించరు. నన్ను నిర్లక్ష్యం చేసినా అది శ్రీహరిని అవమానించినట్లే కదా, అని క్రోధంతో నోటికి వచ్చినట్లు నిందించ సాగెను.
అంబరీషుడు ముని కోపమునకు గడగడ వణుకుచు నా అజ్ఞానం వల్ల నేను ఈ కార్యము చేశాను, నన్ను కాపాడమని ముని పాదములపై పడి క్షమించమని కోరెను. కానీ దయాశూన్యుడయిన దుర్వాసుడు, అంబరీషుని తలను తన ఎడమ కాలితో తన్ని తప్పు చేసిన వారికి శాపము ఇవ్వకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మ చేప గానూ, రెండవ జన్మ తాబేలు గానూ, మూడో జన్మ పంది గానూ, నాలుగో జన్మ సింహము గానూ, ఐదు జన్మ వామనుడు గానూ, ఆరవ జన్మలో క్రూరుడగు బ్రాహ్మణుడు గానూ, ఏడు జన్మలో రాజు గానూ, ఎనిమిదో జన్మలో రాజ్యము, సింహాసనం లేని రాజు గానూ, తొమ్మిదో జన్మలో పాషండ మతస్తునిగానూ, పదవ జన్మలో దయ లేని బ్రాహ్మణుడిగా పుడతావు అని శపించెను.
ఇంకా కోపం తగ్గక మరలా శపించపోగా, శ్రీ మహావిష్ణువు, బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని, తన భక్తునికి అపాయం ఏమీ కలగకూడదని అంబరీషుని మనసులో ప్రవేశించి, మునివర్యా ! మీ శాపాన్ని నేను అనుభవిస్తాను, అని ప్రార్థించాడు. అయినా కూడ ఆ ముని కోపం తగ్గక ఇంకా శపించబోగా, శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అడ్డు పెడతాడు. ఆ సుదర్శన చక్రం అగ్ని జ్వాలలతో దుర్వాసుని మీద పడబోయింది. ఆ సుదర్శన చక్రం తనను మసి చేయునని భయపడి " బ్రతుకు జీవుడా " అని పరిగెడుతూ, భూలోకంలోని మహామునులను, దేవలోకం, బ్రహ్మ లోకం కైలాసం వెళ్లి ఎవ్వరిని ఎంత ప్రార్థించినా సుదర్శన చక్రము బారినుండి వారెవరు దుర్వాసుని కాపాడలేకపోయారు. చివరకు వైకుంఠమునకు వెళ్లి, వాసుదేవా, జగన్నాథ, నన్ను రక్షింపుము. నీ భక్తుడైన అంబరీషునికి నా ముక్కోపం వల్ల అపరాధము చేయు తల పెట్టాను. ప్రశాంతమైన మనసుతో నీ భక్తునికి శాపం ఇచ్చి నన్ను కూడా రక్షింపుము, అని ప్రార్ధించెను. అందుకు శ్రీహరి చిరునవ్వుతో, నీవు అకారణముగా అంబరీషుని శపించితివి. నీ ఎడమ కాలితో తన్ని తివి. నీవు అతని ఇంటికి అతిధి వై వచ్చినావు. " నేను వేళకు రాని ఎడల ద్వాదశి ఘడియలు దాటకుండా నీవు భుజించమని చెప్పలేదు. అతను వ్రత భంగం కాకుండా జలపాన మాత్రమే చేశాడు. అంతమాత్రానికే నీవు శపించావు. ఎంత బ్రతిమాలినా నీవు శాంతించలేదు, నేను రాజు హృదయం లో ప్రవేశించి, నీ శాపాన్ని పది జన్మలలో పూర్తి చేస్తాను అని పలికింది నేనె. నీ శాపమును అతడు వినలేదు. అంబరీషుడు నిరపరాధి నీవు అకారణముగా దూషించినావు.
నీ శాపము లో మొదటిదీ మత్స్య జన్మలో సోమకుండడను రాక్షస సంహారం చేస్తాను. 2 వది క్షీరసాగర మధనము సమయంబున మందరపర్వతం మునిగిపోకుండా కూర్మావతారం ఎత్తుతాను. వరాహ జన్మలో హిరణ్యాక్షుని సంహరిస్తాను. నరసింహావతారంలో హిరణ్యకశ్యపుడు సంహరించి ప్రహ్లాదుని రక్షిస్తాను. వామనావతారంలో బలి చక్రవర్తిని పాతాళ లోకానికి అణగద్రోక్కుతాను. భూభారము తగ్గించుటకు బ్రాహ్మణుడైన భూభారం తగ్గిస్తాను.
లోకకంటకుడైన రావణుని చంపుటకు రాముడై, యదువంశంలో శ్రీకృష్ణునిగా, కలియుగ మందు బుద్ధునిగా, కలియుగాంతమున కల్కి అనే పేరున బ్రహ్మ ద్వేషులందర్నీ మట్టు పెడతాను.
నీవు అంబరీషుని ఇచ్చిన శాపం ఈ విధంగా నేను పూర్తి చేస్తాను, అని విష్ణువు పలుకుగా, దుర్వాసుడు విష్ణుమూర్తి వద్ద సెలవు తీసుకుని, భూలోకంలో అంబరీషుని వద్దకు వచ్చి, ధర్మ పాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము, నీకు వ్రత భంగము చేయాలనే దుష్ట ఆలోచనతో ఆలస్యంగా వచ్చాను. నా దుర్బుద్ధి నన్ను వెంటాడుతోంది. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్దకు పంపాడు. కాబట్టి నీవే శరణ్యము, అని అంబరీషుని పరిపరి విధములుగా ప్రార్థించాడు. అప్పుడు అంబరీషుడు, ఓ సుదర్శన చక్రమా! ఈతనిని చంప వలదు. ఈ మునికి ఏ అపాయము కలుగకుండా రక్షింపుము, అని ప్రార్ధించెను. అంతట సుదర్శన చక్రము శాంతించి, ఇంత వరకూ జరిగింది మరిచిపోయి, ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మమును నీవు నిర్వర్తించుము అని పలికెను. మీ ద్వాదశ వ్రత ప్రభావము చాలా గొప్పది, అని వారిద్దరిని ఆశీర్వదించి అదృశ్యమయ్యెను.
ఓ రాజా! ఎవరు శత్రువులకైనను శక్తికొలది ఉపకారము చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని శాస్త్రములు తెలియజేస్తున్నవి. అందుచేత నీవు నాకు తండ్రితో సమానము. నీతో భోజనం చేయుట నాభాగ్యము అని పలికి అంబరీషుని తో కలిసి పంచభక్ష పరమాన్నాలతో విందారగించి, అంబరీషుని దీవించి తన ఆశ్రమమునకు వెళ్ళను.
కార్తీక శుద్ధ ద్వాదశి రోజున విష్ణుమూర్తి క్షీర సాగరం నందు శేష శయ్య పైనుండి లేచి ప్రసన్నంగా ఉంటాడు. ఆ రోజు చాలా మహిమగల రోజు. ఎవరికైతే వైకుంఠంలో నివాసం ఉండాలని కోరిక ఉంటుందో, అట్టివారు ఏకాదశి, ద్వాదశి వ్రతములు రెండు చేయవలయును. మఱ్ఱి విత్తనము చాలా చిన్నదీ, కాని దాని వృక్షము చాలా పెద్దది. అలాగే కార్తీక మాసంలో నియమానుసారంగా చేసిన ఏ కొంచెం పుణ్యమైన ను అవసాన కాలంలో యమదూతలు పాలు కాకుండా కాపాడును. అలాగే కార్తికంలో ఉసిరికాయలు దక్షిణతో దానము, ఉసిరికాయలతో దీపారాధన, ఉసిరి చెట్టు కింద సహపంక్తి భోజనం చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నవి. ఉసిరి చెట్టుకి పూజ చేసేటప్పుడు ఈ విధంగా ప్రార్థన చెయ్యాలి.
ఉసిరి చెట్టు వద్ద ప్రార్థన ( పూజ)
"ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరీ విద్యాం, పుత్ర పౌత్రాం, ఆయురారోగ్యం, సర్వసంపదాం మమదేహి మహాప్రాజ్ఞే యశోదేహి బలంచమే - ప్రజ్ఞాం మేధాంచ సౌభాగ్యం విష్ణు భక్తించ శాశ్వతీమ్ నీరోగం కురుమాం నిత్యం నిష్పాపం కురుసర్వదా"
అని ప్రార్థన చేసుకొని ధూప దీప నైవేద్యాలతో హారతి ఇవ్వాలి. తర్వాత ఉసిరి చెట్టు క్రిందనే సహపంక్తి భోజనాలు చేయాలి. ఇలాంటి పూజలు, వ్రతాలు వల్ల ఇహ, పర పాపాలు నశించి మోక్షము పొందుతారు. ఇది ముమ్మాటికి నిజం.
సకలం శ్రీ లక్ష్మీ నారాయణతే సమర్పయామి!!!
శ్రీకృష్ణార్పణమస్తు !!


ConversionConversion EmoticonEmoticon