కార్తిక పౌర్ణమి వ్రత మహత్యం

            

      కార్తీక మాస మహత్యం గురించి ఎంత చెప్పినా విన్నా తనివి తీరదు.  కార్తీకమాసంలో విష్ణువును సహస్ర నామావళి ని తులసీదళం తో గాని బిల్వ పత్రములలో పూజ చేసినచో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది.

 కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద సాలగ్రామము నుంచి భక్తితో పూజించిన వారికి కలిగే పుణ్యం ఇంత అని చెప్పడం కుదరదు.  అలాగే బ్రాహ్మణులకు ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తాను కూడా భుజించిన సర్వ పాపములు తొలగిపోతాయి.  కార్తీక స్నానం, దీపారాధనలు చేయలేనివారు  ఉదయం, సాయంత్రం ఏ దేవాలయమునకు అయినా వెళ్లి  భక్తితో దర్శనం చేసుకున్న వాళ్ల పాపాలు నశించిపోతాయి. ఈ కార్తీకమాసంలో తులసి కోట దగ్గర ఆవుపేడతో అలికి , వరి పిండితో ముగ్గులు వేసి, నువ్వులు పోసి, ధాన్యము పోసి దానిపై  ప్రమిద నుంచి  దాన్నిండా నువ్వుల నూనె పోసి ఒత్తి వేసి వెలిగించవలెను. ఈ దీపము రాత్రింబవళ్లు ఆరకుండా వెలిగించవలెను. దీనినే నందాదీపం అని అంటారు.   ఈ దీపానికి  నైవేద్యం పెట్టి కార్తీక పురాణం చదివితే దానిని మించిన పుణ్యం వేరేది లేదు. ఆయురారోగ్యాలు, సకల ఐశ్వర్యములు  కలుగుతాయీ.  అలాగే కార్తీక మాస పౌర్ణమి రోజున తన శక్తి కొలది దానం చేసి, నిష్ఠతో వ్రతం చేసి సాయంకాల సమయంలో శివుడు లేక విష్ణువు ఏదైనా ఆలయానికి వెళ్లి రాత్రి అంతయు జాగరణము చేసి మరునాడు బ్రాహ్మణులకు  భోజనం  పెట్టినచో  వారికి ఇహ  మరయు  పరములందు  సర్వసౌఖ్యములు  అనుభవింతురు. 

 ఈ నెల రోజులు ఇతరుల ఎంగిలి తినకూడదు. శ్రాద భోజనం చేయకూడదు.  ఉల్లిపాయలు తినకూడదు. ఈ నెల రోజులూ రాత్రులు భోజనం చేయరాదు. ఈ నెలంతా కార్తీక స్నానం చేయు వారు మాత్రమే ఇవి పాటించాలి. అలాగే నూనె రాసుకుని తల స్నానం చేయరాదు.  అలాగే వేడి నీటి స్నానం చేయరాదు. స్నానానికి నది అందుబాటులో లేని ఎడల నూతి దగ్గర గాని చెరువు దగ్గర గాని ప్రాతఃకాలాన స్నానం చేయాలి.

 స్నానం చేసేటప్పుడు    

గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ

నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు !!

 అని చదువుతూ చన్నీటి స్నానం చేయవలెను ఈ ప్రకారంగా కార్తీకమాసమంతా చేయవలెను. 


 కార్తీక పౌర్ణమి రోజున నేను చేసే పద్ధతి:-

    పౌర్ణమి రోజున తెల్లవారు జామున నాలుగు గంటలకు లేచి చన్నీళ్లతో తలస్నానం చేసి ఇంట్లో దేవునిముందుగా దీపం వెలిగించి ఆ తర్వాత తులసి కోట వద్ద దీపం వెలిగించి నక్షత్రదర్శనం చేసుకుని విష్ణు సహస్రనామం చదువుతాను.  ఆ తర్వాత ఇంట్లో పనులు చక్క బెట్టుకుంటాను.  ఆ రోజు కుటుంబమంతా ఉపవాసం ఉంటాము. ఉదయాన్నే ఒకసారి మాత్రమే కాఫీ తాగుతాము, మధ్యాహ్నం 1:00 కు నిమ్మరసం తాగుతాము. రెండు గంటలకు లేచి వంటగది అంతా శుభ్రం చేసుకుని, తులసి కోట చుట్టూత ముగ్గులు పెట్టి, తులసికోటలో ఉసిరికొమ్మ నాటుతాను. ఆ తరువాత స్నానం చేసి మడి కట్టుకొని వంట ప్రారంభిస్తాను. ఆ రోజు మా తమ్ముడు కుటుంబాన్ని భోజనానికి పిలుస్తాను. వాళ్లు కూడా ఉపవాసం ఉంటారు. పప్పు, కూర, పచ్చడి, పులుసు, పొంగలి, పులిహోర, బజ్జీలు, అప్పడాలు మొదలైనవి చేస్తాను.  వంట అయిపోయే సమయానికి చీకటి పడుతుంది. కాళ్లు చేతులు ముఖం కడుక్కొని దీపం వెలిగిస్తాం. ఆ తర్వాత తులసి కోట చుట్టూ దీపాలు పెడతాను. ఒక పెద్ద ప్రమిద తీసుకొని అందులో 365 వత్తులు వేసి  వెలిగిస్తాము. చంద్రుడు ఉదయించిన తరువాత చేసిన పదార్థాలన్నీ తులసికోట ముందు పెట్టి పూజ చేసి నైవేద్యం పెట్టి హారతి ఇస్తాను. అంతలో మా తమ్ముడు మరదలు, మా వారు అందరూ వస్తారు. వాళ్లు కూడా చంద్రునికి, నక్షత్రానికి నమస్కారం చేసి తరువాత భోజనాలకి కూర్చుంటారు. మా తమ్ముడు మరదలు కూడా ఒక లెక్క, ఉపవాసం  రోజున ఒక దంపతులకు భోజనం పెట్టడం. రెండు విధాల అన్నమాట. ఇదిగాక ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది అది ఏమిటంటే ఈ కార్తీక పౌర్ణమి రోజు అన్నదమ్ములకు, అక్కా చేల్లెలకు ఇది ఎంతో ప్రియమైన పండుగ. తరువాత భోజనాలు పూర్తి అవుతాయి.

 తరువాత వాళ్ళిద్దరికీ దక్షిణ తాంబూలాలు ఇస్తాను.  నా తమ్ముడు ఏమో నాకు చీర జాకెట్టు పెడతాడు  వాడే స్వయంగా ఇవ్వాలి అది పద్ధతి. ఆ తర్వాత నేను, మా అమ్మ మిగతా వాళ్ళందరూ  భోజనం చేస్తాము. ఆ రాత్రి పని అమ్మాయికి కూడా నేను చేసిన వంట అంతా పెట్టి,  ఒక చీర, తాంబూలం ఇచ్చి పంపుతాను. ఇది నేను చేసే కార్తీక పౌర్ణమి పూజ.  ఈ కార్తీక పౌర్ణమి అంటే నాకు ఎంతో ఇష్టమైన రోజు. ఆ రోజు చంద్రోదయం చాలా ప్రశాంతంగా, ప్రకాశంగా ఎంతో మనోహరంగా కన్నుల విందు చేస్తుంది.   ఆ చంద్రోదయాన్ని చూసి  తరించాలే కాని వర్ణించలేము.



 తమిళులు ఈ పౌర్ణమిని దీపోత్సవంగా జరుపుకుంటారు. ఇళ్లన్నీ వెలిగించిన  ప్రమిదలతో నేత్రపర్వంగా కనిపిస్తాయి. ఈ దీపోత్సవం తిరువన్నామలై  గుడిలో చాలా గొప్పగా జరుగుతుంది. ఇక్కడ ఉన్న పర్వతంమీద కర్పూరం  కుప్పలాగా వేసి అఖండ దీపం వెలిగిస్తారు.  ఈ దీపం వెలుతురు కొన్ని మైళ్ల దూరం దాకా కనిపిస్తుంది.  ఆ రోజు ఎన్నో వేల దీపాలు పరమేశ్వరుని దగ్గర  వెలిగించి పాలు పండ్లు నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ దీపాల వెలుగు చూస్తే ఎటువంటి వారికైనా మనసులో భక్తిభావం తప్పక కలుగుతుంది. ఈ కార్తీకమాసం చాలా మంచిది. వనభోజనాలకు వెళ్తారు, భేదభావాలు లేక సంతోషంగా గడుపుతారు. పిల్లలు ఆటపాటలతో సంతోషంగా గడుపుతారు. పెద్ద వాళ్లంతా ఉసిరి చెట్టు కింద కూర్చొని పూజలు చేసి సహపంక్తి భోజనాలతో సంతోషంగా గడుపుతారు.

   అలాగే కార్తీకమాసంలో నక్షత్ర దీపాలు పెడతారు. బియ్యప్పిండితో దీపాలు చేసి అందులో ఆవునెయ్యి పోసి కుంభ వత్తులు వేసి వెలిగించాలి. ఎన్ని నక్షత్రాలు ఉంటే  అన్ని.  మనకు ఉన్న నక్షత్రాలు 27. వీటిని వెలిగిస్తే వాటిని నక్షత్ర దీపాలు అంటారు.  వాటి పేర్లు  అశ్వని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ముఖ, పుబ్బా,  ఉత్తర, హస్త , చిత్తా,  స్వాతి, విశాఖ, అనురాధ,  జేష్ఠ,  పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, మూల, పూర్వాషాడ, ఉత్తరాషాఢ, శ్రవణం, దనిష్ఠ, శతభిషం, రేవతి మొదలైనవి.

 ఇది గాక ఉసిరికాయల్ని తీసుకొని వాటి లోపల  గుజ్జు తీసి వేసి  డొల్లలాగా తయారు చేసి దానిలో ఆవు నెయ్యి వేసి కుంభ వత్తి వేసి వెలిగించి వీటిని బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలంతో కలిపి దానం ఇవ్వాలి. ఇలా ఉసిరి దీపదానం చేయడం వల్ల  ఇహమందును, పరమందును సకల ఐశ్వర్యములతో తులతూగుతారు. ఇది ముమ్మాటికి నిజం.

 వెనుక జన్మలో చేసిన పాపాలు కూడా తొలగి పోవును. సంవత్సరంలోని అన్నిమాసాల కన్నా కార్తీకమాసం ఉత్తమమైనది. హరిహరులకు ప్రీతికరమైనది. కనుక అందరూ ఇటువంటి పుణ్యకాలము వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను.


 ఓం శ్రీ దామోదరాయ నమః

 ఓం కృష్ణార్పణమస్తు !!

ఈ వారం చిట్కా:-  

 రాత్రి మంచి నిదుర పట్టడానికి:-  మనలో చాలా మంది రాత్రులు సరిగా నిదుర పట్టక అవస్థ పడుతూ ఉంటాము. అలాంటి వారికందరికీ ఒక చిన్న చిట్కా.   ప్రతి రోజు సాయంత్రము ఒక గ్లాస్ నీళ్ళల్లో తేన కలిపి త్రాగితే మంచి నిదుర పడుతుంది

Previous
Next Post »