దీపావళి ధమాకా

 

           దీపావళి అంటే పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా సరదాగా ఉంటుంది.  పెద్ద వాళ్లకేమో ఇంటి చుట్టు దీపాలతో తోరణాలు అమర్చాలని, పిల్లలకు ఏమో మతాబులు కాల్చుకోవాలని సరదాగా ఉంటుంది. అసలు దసరా పండగ వెళ్లి నప్పటి నుంచి అక్కడక్కడ దీపావళి మందులు శబ్దాలు వినిపిస్తుంటాయి.  నేను రాసేదంతా నా చిన్నప్పటి సంగతులే. ఇదివరకూ దీపావళి అంటే తారాజువ్వలు, చిచ్చుబుడ్లు, విష్ణుచక్రాలు, కాకరపువ్వొత్తులు  మొదలైనవి దొరుకుతాయి.   తాటాకు టపాకాయలు, సీమ టపాకాయలు ఇలాంటివన్నీ పిల్లలు, పెద్దలు అందరూ ఆనందంగా కలుస్తారు. ఈ మధ్యకాలంలో దీపావళి అంటే ఇంటి చుట్టూ దీపాలు వెలిగించడం అనే విషయం మర్చిపోయి చెవులు చిల్లులు పడే శబ్దాలతో పండగ అని గుర్తుంచుకోవాల్సిన వస్తోంది. యుద్ధాల తరువాత మిగిలిన సామాగ్రిని మనం మందుల   రూపంలో తెచ్చుకుని  కాల్చుకుంటున్నామా ? అని అనిపిస్తోంది.  దీపావళి అంటే సంతోషానికి బదులు భయం వేస్తుంది. అసలు దీపావళి అంటే దీపాల వెలుగు నల్లటి ఆకాశంలో తళుక్కున మెరిసే నక్షత్రాలు, కిందేమో గాలికి కదలాడే దీపాల తోరణాలు, చూచుటకు కనులకింపుగా, మనసు ఆహ్లాదకరంగా ఎంతో శోభాయమానంగా ఉంటుంది. ఏదో సరదా కోసం మన పెద్దవాళ్ళు విష్ణుచక్రం, చిచ్చుబుడ్డి, తారాజువ్వలు, మతాబులు ఇలాంటివి తీసుకువచ్చి పిల్లలు పెద్దలు అందరూ కాల్చేవారు. కాని ఇల్లు, వాకిళ్ళు దద్దరిల్లి రేట్లు, పసిపిల్లలు భయపడేలా, రాత్రుళ్ళు నిద్ర లేక, రోడ్డు మీద నడుస్తుంటే ఎక్కడ మీద పడుతుందో అని భయం. ముసలి వాళ్ళ అయితే ఆ శబ్దానికి చెవుల్లో దూది పెట్టుకుని లోపల కూర్చుంటారు. ఇవి కాలుతుంటే కంటికి అందంగా ఉంటుంది అనుకుందామా అంటే అది అంటే అదీ లేదు, విపరీతమైన శబ్దం తప్ప. ఈ  శబ్దాలు వల్ల మనకు ఏమీ ఆనందం కలుగుతుందో అర్థం కాదు. బోలెడు డబ్బు పోసి వాటిని కొంటున్నాము. కానీ ఏమి ప్రయోజనం పొందుతున్నాము. దీపావళీ అంటే దీపాల పండుగ అనే విషయాన్ని మర్చిపోయి, ఢా౦ ఢా౦ శబ్దాలు పండుగని గుర్తు పెట్టుకోవాల్సి వస్తోంది.

         దసరా వెళ్ళిన తరువాత మేము పిల్లలంతా కలిసి కొవ్వొత్తులు, మతాబులు తయారు చేయడం మొదలు పెడతాము.

 తెల్ల మతాబులు- తయారీ విధానం:-     వీటిని తయారు చేయడానికి కావలసినవి, సురేకారం, గంధకం. వీటిని ముందుగా పొడిగా బాగా నూరుకోవాలి. తర్వాత రెండింటినీ బాగా కలుపుకోవాలి. తర్వాత పాత పేపర్లతో (ఎక్కువ పల్చగా కాకుండా ఎక్కువ మందంగా కాకుండా)  గొట్టాలు తయారు చేసుకోవాలి.  గొట్టాలు ఒకవైపు గమ్ పెట్టి అంటించాలి. రెండో వైపు నుంచి ముందుగా కొంచెం ఇసుక పోయాలి. తరవాత కలిపి ఉంచుకున్న మందుతో నింపాలి. నింపిన తర్వాత ఆ భాగాన్ని కూడా మూసివేయాలి. అప్పుడు మందు కారిపోకుండా ఉంటుంది. తరువాత వాటిని ఎండలో పెట్టాలి. ఈ గొట్టాలు చేసేముందు ఇసుక ఎందుకు వెయ్యాలంటే మతాబులు కాల్చేటప్పుడు చివర్లో చేతులు కాలకుండా ఉంటాయి. ఇలా ఇంట్లో చేసుకుంటే కావాల్సినవన్నీ చేసుకోవచ్చు. డబ్బుకు డబ్బు ఆదా అవుతుంది. నాకు ఇంతే గుర్తు ఉంది అంతవరకే  వ్రాస్తున్నాను.

 కొవ్వొత్తుల తయారీ:-  మైనపు వత్తులు తయారు చేయడం చాలా తేలిక. ఒక మందపాటి కాగితంతో గుండ్రంగా, కొంచెం లావుగా ఐదు లేక ఆరు అంగుళాల పొడవు గల గొట్టాలను తయారుచేసి వాటి అడుగున గమ్ము తో అంటించి మూసివేయాలి. కొంచెం లావుగా ఉన్న నూలువత్తిని తీసుకుని, గొట్టం మధ్యలో వేసి కరిగించి పెట్టుకున్న మైనాన్ని ఆ గొట్టంలో పోయాలి. అలా పోయగానే మైనము చల్లారిపోయాయి గట్టిపడటం మొదలవుతుంది. తరువాత బాగా గట్టిపడుతుంది. తరువాత పేపర్ గొట్టంనుంచి బయటికి తీస్తే కొవ్వొత్తి తయారవుతుంది.  వీటిని ఇంకా సులువుగా తయారు చేయడానికి అచ్చులు అమ్ముతారు. వాటిల్లో పోస్తే  ఇంకా తక్కువ సమయంలో ఎక్కువగా తయారు చేయవచ్చు. రంగుల కొవ్వొత్తులు కావాలంటే కరిగించిన  మైనములో  రంగులు కలుపుకు౦టే సరిపోతుంది. ప్రయత్నించి చూడండి.  మన౦ స్వయంగా చేస్తే సంతోషం కదా !



 గమనిక:-   ఇంట్లో పెద్ద వాళ్ళు ఉంటే వాళ్ల చెవుల్లో దూది పెట్టండి పిల్లలు కూడా (చిన్న పిల్లలు) పెట్టండి. దీనివల్ల చెవులు సురక్షితం.  లేకపోతే ఆ బాంబు సౌండుకి ఎక్కడ కర్ణబేరి దెబ్బతింటుందని భయపడాల్సిన వస్తుంది. మందులు కాల్చే వయసు పిల్లలకైతే, సాయంత్రం మందులు కాల్చే సమయంలో ఒంటికి నూలు దుస్తులు, కాళ్లకు బూట్లు వేసి పంపండి. మందులు కాల్చే ప్రాంతంలో అందుబాటులో ఒక బకెట్ నీళ్లను ఉంచుకోండి. మందులు కాల్చేటప్పుడు పిల్లలు దగ్గర పెద్ద వాళ్ళు తప్పనిసరిగా ఉండి జాగ్రత్తగా చూడాలి, వాళ్లకు జాగ్రత్తలు చెప్పాలి.


ఈ వారం చిట్కా:- 

 శోభి మచ్చలు తగ్గడానికి:-    కొంతమందికి ముఖం మీద, చెవుల మీద, నుదిటి మీద, పెదవుల మీద ఎక్కడైనా సరే ఈ  మచ్చలు రావొచ్చు. శరీరము  రంగు కంటే కొంచెం తెల్లగా  మచ్చలు శరీరం అంతా వ్యాపిస్తాయి. దీనికి మందు తులసి ఆకుల రసం, నిమ్మకాయ రసం  సమ భాగంగా కలిపి ఉదయం, సాయంత్రం శోభి మచ్చలు మీద రాస్తూ ఉంటే ఎలాంటి శోభి  మచ్చలు అయినా పూర్తిగా త్వరగానే తగ్గుతాయి. 

Previous
Next Post »