ముక్కోటి ఏకాదశి, గీత జయంతి, హ్యాపీ న్యూ ఇయర్ విశేషాలు

 


 ముక్కోటి ఏకాదశి,  గీత జయంతి విశేషాలు:- 

      డిసెంబర్ 25వ తేదీ ముక్కోటి ఏకాదశి. మేము ముక్కోటి ఏకాదశి కి కేరళలోని పాలక్కాడ్ లోని శ్రీ లక్ష్మీ నారాయణ పెరుమాల్ ఆలయం చూడడానికి వెళ్ళాము. ఇక్కడ విష్ణుమూర్తి భూదేవి శ్రీదేవి సమేతంగా దర్శనమిస్తాడు. ప్రతి నెల ఇక్కడ వైష్ణవ సంప్రదాయం ప్రకారం పూజలు చేస్తారు. ఈ ఆలయం ఐదు వందల సంవత్సరాల క్రిందట నిర్మించబడినది. ఇక్కడ స్వామికి భక్తాభీష్ట గా పేరు. ఆయన్ను వైకుంఠనాథుడు అంటారు. ప్రకృతి అందాలకు నిలయమయింది  కేరళ. అరేబియా సముద్రపు అందాలు, టీ, కాఫీ తోటలు, రబ్బర్ తోటలు, పచ్చని కొబ్బరి తోటలతో అలరారే భూలోక స్వర్గం కేరళ. జీవితంలో ఒకసారైనా తప్పనిసరిగా చూడవలసిన రాష్ట్రం ఇది.

 నిరంతరం వైష్ణవ సంప్రదాయ అగ్రహారం ఇది, పూర్తిగా కేరళ పద్ధతిలో కలప, గ్రానైట్ తో  నిర్మించారు. ఇక్కడ నారాయణుడు లక్ష్మీ సమేతంగా, తులసి మాలాంక్రుతుడై దేదీప్యమానంగా తేజోమయుడుగా దర్శనమిస్తాడు. కొద్ది రోజుల క్రితం మహాకుంభాభిషేకం ఎంతో వైభవంగా నిర్వహించారు. ముక్కోటి సందర్భంగా అక్కడ ఉంటున్న భక్తులందరూ చేత 108 సార్లు ఓం నమో నారాయణ అని జపించమన్నారు. తర్వాత లక్ష్మీనారాయణులకు నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని మాకంతా పంచిపెట్టారు. అది అమృతం లాగా చాలా బాగుంది. ఆరోజు రాత్రి కూడా అక్కడే ఉన్నాము. ఎందుకంటే " గీతాజయంతి " కూడా ముక్కోటి రోజే.  ఆ రోజు రాత్రి భజనలు, ప్రసంగాలు అవి ఉన్నాయి. ప్రసంగాలు ఏంటంటే, ఆధ్యాత్మికత గురించీ భక్తి ప్రసంగాలు, మానసిక, శారీరక బాధలు తొలగిపోయే ఉపదేశాలు, ఆరోగ్య సూత్రాలు, జీవితంలో విజయాలు సాధించడానికి మెలుకువలు, ఇవన్నీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఉపదేశాలు. ఇవి అన్నీ మనం అర్థం చేసుకోగలిగితే, "భగవద్గీత"లోని ప్రతి అంశం మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది.

 ఓం నమో భగవతే వాసుదేవాయ !!!! 


 హ్యాపీ న్యూ ఇయర్:-   

 కార్తీకం, మార్గశిరం వంటి పూజలన్నీ పూర్తయినాయి. ఇంక కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాము. 2020 సంవత్సరం అంతా కరోనా భయంతోనే గడిచిపోయింది. ఎప్పుడు కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతామా, అప్పుడైనా ఈ కష్టాలు పోయి మంచి రోజులు వస్తాయని భారతదేశమంతా ఎదురుచూస్తోంది. ఆనందోత్సాహాలతో, కేరింతలతో తరతమ భేదంలేక, ఉల్లాసంగా జరుపుకునే వేడుక ఇది.

 నా చిన్నతనంలో న్యూ ఇయర్ అంటే వాళ్ల వాళ్లందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పి,  పూలదండలు, పుష్పగుచ్ఛాలు, ఆపిల్స్, కమలాలు అన్నీ ఇస్తూ ఉంటారు. ఆ తరువాత మా పిల్లల దగ్గర వచ్చేసరికి గ్రీటింగ్స్ ఇవ్వడం మొదలైంది.  వాకిట్లో వేసే ముగ్గులు మీద హ్యాపీ న్యూ ఇయర్ అని రంగురంగులతో రాస్తారు. వాకిళ్లు అన్నీముగ్గులతో నింపి, రంగులతో అలంకరణ చేసే సరికి రాత్రి 12 అవుతుంది. దూరప్రాంతాల వాళ్ళకి ముందుగా గ్రీటింగ్ కార్డ్స్ కొని పోస్ట్ చేస్తారు. కొంతమందికి స్వయంగా ఇచ్చుకుంటారు. ముఖ్యంగా స్కూల్ టీచర్లు, హెడ్మాస్టర్ లకి ముఖ్యమైన వాళ్లకి ఆ తరువాత గ్రీటింగ్ స్థానాన్ని సెల్ ఫోన్లు ఆక్రమించాయి. ఎక్కడ ఉన్నా ఎంత దూరమైనా సరే ఒక ఫోన్ కాల్ తో శుభాకాంక్షలు చెప్పుకోవచ్చు ప్రస్తుతం రాత్రి 12 గంటలకు కేక్ కట్ చేసుకుని ఎవరికి వాళ్లు ఆనందిస్తున్నారు. మెయిల్, మెసేజ్ ,వాట్సప్ ద్వారా విషెస్ చెప్పుకుంటున్నారు. కరెక్ట్ గా 12 గంటలకు గుళ్లకు వెళ్లి పూజలు  చేయించుకుంటున్నారు.   ఇలా ఎవరికి తోచిన విధంగా వారు కొత్త సంవత్సరం జరుపుకుంటున్నారు.

2021 సంవత్సరం అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని ఆకాంక్షిస్తూ, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

ఈ వారం ముగ్గులు:- 

1)

2) 




Previous
Next Post »