
ధనుర్మాసంలో చేసే పూజలు తిరుప్పావై, గోదాదేవి కల్యాణం అన్ని పోయిన సారి బ్లాగులో చెప్పాను. ఈసారి మార్గశిర లక్ష్మీవారం గురించి తెలుసుకుందాము.
మార్గశిర గురువారంని లక్ష్మి వారం అని అంటారు. మామూలుగా కూడా గురువారాన్ని లక్ష్మివారమనే అని అంటారు. ఇంటి ఇల్లాలిని గృహలక్ష్మి గా భావిస్తారు. ఇంటిలోని మంచి చెడులకు ఇంటి ఇల్లాలు కారణమవుతుంది. పాతరోజుల్లో పెద్దలు చెప్పేది ఏంటంటే, ఇంటికే కళ తెచ్చు ఇల్లాలికి సాటిరావు కోటి దీపాలు అని అంటారు. దీపం అంటే లక్ష్మీదేవి అని అర్థం కదా. ఇంట్లోని సమస్యలు కాని, ఈతి బాధలు కాని, రుణ సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్ని తొలగిపోయి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతారు. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలన్నీ లక్ష్మీ వారాలని అంటారు. మార్గశిర మాసంలోని గురువారాలు, పుష్య మాసంలోని మొదటి గురువారం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. పుష్య మాసంలో వచ్చే మొదటి గురువారం పుట్టింటి వాళ్ల శ్రేయస్సు కోసం చేస్తారు. ఇదే విషయాన్ని ఈ కథలో వివరంగా తెలుస్తుంది.
ఈ వ్రతం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటంటే, ఆ రోజు ఇంటిలో పిల్లలను తిట్టడం, కొట్టడం చేయకూడదు. అది చీపురుతో అసలు కొట్టరాదు. తొలి సంధ్య, మలిసంధ్య నిదురించకూడదు. అన్నము నెట్టడం, నిర్లక్ష్యం చేయడం కూడదు. అబద్దాలు చెప్పడం, ఏడవడం చేయరాదు. ఇళ్లు వాకిళ్లు శుచిగా ఉంచుకోవాలి. ఈ వ్రతం చేసే వాళ్లు కూడా శుచి, శుభ్రంగా (మనసు, శరీరం) ఉండాలి. మధుపానం, ధూమపానం, మాంసం మొదలగునవి నిషిద్ధము. తోడబుట్టిన వాళ్ళ మనసు కష్టపెట్టకూడదు.
పూజ కోసం ఒక పీట తీసుకొని, దానికి పసుపు రాసి బియ్యప్పిండితో ముగ్గువేసి, కుంకుమతో బొట్టు పెట్టి, అలంకరించాలి. తరువాత పసుపుతో వినాయకుడ్ని చేసి పీట మీద ఉంచాలి. ఆ తరువాత లక్ష్మీదేవి పటం పీట మీద ఉంచుకోవాలి. ఆ తరువాత గురువారం నాడు బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి వాకిళ్లను శుభ్రం చేసి లక్ష్మీదేవి పాదముద్రలు వెయ్యాలి. ఆ తల్లి ఆ పాదాల వెంట నడుచుకుంటూ మన ఇంటిలోకి నడిచి వస్తుందని పెద్దల ఉవాచ. తలస్నానం చేసి తరువాత వ్రతం ఆరంభించాలి.
ముందుగా వినాయకుని పూజించి బెల్లం నైవేద్యం పెట్టాలి. ఆ తర్వాత అమ్మవారి పూజ చేయడం మొదలుపెట్టాలి. లక్ష్మీ అష్టోత్తరం, కనకధారా స్తోత్రం అష్టలక్ష్మి స్తోత్రం, లక్ష్మీ సహస్రనామం మీ వీలునుబట్టి చదివి భక్తితో పూజించి, ధూప, దీప, నైవేద్యాలతో ఆ తల్లిని అలరించాలి. బ్రహ్మ ముహూర్తంలో లేచి చేసే ఏ పూజ అయినా విశేషఫలాన్ని ఇస్తుంది. ఆ తల్లి మనల్ని విడిచి పెట్టకుండా మనతోనే ఉంటుంది. మనకు ఏమి చేతకాకపోతే ఒక బెల్లం ముక్క అయినా ఆ తల్లి స్వీకరిస్తుంది. దీనికి ఉదాహరణగా ఒక కథ వివరిస్తాను.

పూర్వం కళింగ రాజ్యం లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి సుశీల అను ఒక కూతురు ఉండేది. ఆ సుశీలకి తల్లి లేదు సవతి తల్లి సుశీలను పనులు మొత్తం చేసి, తన పిల్లలను ఆడించమని చెప్పి, సుశీల చేతిలో కొంచెం బెల్లం ముక్క ఉంచేది. సవతి తల్లి మార్గశిర గురువారం (లక్ష్మీవారం) పూజ చేయడం చూసి, తను కూడా మట్టితో అమ్మవారి ప్రతిమను చేసి, తనకు దొరికిన పూలతో అమ్మవారిని పూజించి, పిల్లల కోసం ఇచ్చిన బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టేది. అలా మార్గశిర మాసం అంతా చేసేది. కొన్నాళ్ళకు సుశీలకి వివాహం జరుగుతుంది. ఆమె అత్త వారి ఇంటికి వెళుతూ ఆ మట్టి బొమ్మను కూడ తనతో తీసుకొని వెళుతుంది. ఆమె అత్తవారి ఇంటికి వెళ్లగానే పుట్టింటి వారి ఇంట్లోనుంచి లక్ష్మీ వెళ్లిపోతుంది. వాళ్ళు కడు బీద వాళ్లు అవుతారు. సుశీల అత్తవారిల్లు మాత్రం భోగభాగ్యాలతో తుల తూగుతుంది. పుట్టింటివారు బీద తరం వల్ల బాధలు పడుతున్నారని అని తెలిసి సుశీల చాలా విచారిస్తుంది. సవతి తల్లి ఆ దరిద్రమును భరించలేక కొడుకుని పిలిచి అక్క దగ్గరికి వెళ్లి, మన పరిస్థితి చెప్పి, ఏమైనా సహాయం చేయమని అడగమని చెబుతుంది. పిల్ల వాడు అలాగే అని అక్క దగ్గరికి వెళ్లి, పరిస్థితిని చెప్పగా సుశీల వాళ్ళ పరిస్థితికి బాధపడి ఒక కర్రను తెప్పించి దాన్ని తొలచి దాని నిండా రత్నాలు నింపి ఆ కర్రను తమ్ముడికి ఇచ్చి పంపుతుంది. మా అక్క సహాయం చేయమని అడిగితే కర్ర ఇచ్చింది ఏంటి, ఇది ఎందుకు అని అవతల పారేస్తాడు. ఇంటికి వచ్చి అక్క ఏమి ఇవ్వలేదు అని చెప్తాడు. మన ఖర్మ ఇంతేలే అని అనుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత కొడుకుని పిలిచి అక్క దగ్గరికి వెళ్లి రా, సహాయం అడుగు అని పంపుతుంది. సుశీల తమ్ముడు చెప్పింది విని, బాధపడి, ఒక చెప్పుల జత తెప్పించి, దాని నిండా రత్నాలు నింపి ఒక గుడ్డలో చుట్టి తండ్రికి ఇవ్వమని చెబుతుంది, సరేనని ఆ చెప్పుల జత తీసుకొని వస్తుండగా దారిలో దాహం వేసి ఆ చెప్పులను ఒడ్డున పెట్టి మంచినీళ్ళు తాగడానికి వెళ్లగా, ఆ చెప్పుల జతని ఎవరో తీసుకొని వెళ్తారు. ఇంటికి వచ్చి జరిగింది తల్లికి చెప్పగా ఆమె చాలా బాధపడుతుంది. తరువాత ఇంకొక రోజు మరల పంపగా, సుశీల ఈసారి, గుమ్మడి పండును తెప్పించి దాన్నిండా వజ్రాలు నింపి తల్లికి ఇవ్వమని చెప్పగా సరేనని వెళ్తాడు. దోవలో సాయంకాలం అవ్వగా సంధ్యావందనం చేయుటకు, ఒడ్డున కాయనుంచి నదిలోకి దిగగా ఆ కాయను ఎవరో తీసుకొని వెళ్తారు. మరలా ఇంటికి వచ్చి తల్లికి తెలుపగా మన కర్మ ఇంతే అనుకుంటుంది. ఆ తర్వాత కొంతకాలానికి తల్లి స్వయంగా కూతురు ఇంటికి వెళ్తుంది. తల్లి పరిస్థితిని చూసి బాధ పడి తల్లి చేత మార్గశిర లక్ష్మీవారం వ్రతం చేయించాలి అనుకొని తల్లి దగ్గర, ఈరోజు గురువారం. మనం వ్రతం చేసుకుందాము, నిష్టగా ఉండమని చెబుతుంది. కాని తల్లి ఏవో ఆటంకాలు వల్ల నాలుగు వారాలు చేయలేకపోతుంది. అది చూసి కూతురు ఐదవ గురువారం తల్లిని తన చెంగుకు కట్టుకొని, తనవెంట త్రిప్పుకుంటూ, ఏ ఆటంకాలు రాకుండా, చూసుకుంటూ తల్లి చేత వ్రతం చేయిస్తుంది. పూర్ణాలు నైవేద్యం పెట్టిస్తుంది. అయినా సరే లక్ష్మీ బయటకు వెళ్తుంది. అది చూసి సుశీల " ఏం తల్లి అలా వెళ్ళిపోతున్నావు నీ పూజ చేశాము కదా!" అని అడుగగా అమ్మాయి, నీ చిన్నతనంలో నీ తల్లి నిన్ను చీపురుతో కొట్టింది. అందుకనే వెళ్ళిపోతున్నాను, అని అంటుంది. అమ్మా లక్ష్మీదేవి, నా తల్లి తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను, నా తల్లిని క్షమించు అని వేడుకుంటుంది. అప్పుడు ఆ తల్లి మళ్ళీ వ్రతం చేయించమని చెబుతుంది. దేవి అనుగ్రహంతో మళ్లీ పూజ చేసి, కథ చదివి, తలమీద అక్షింతలు వేసుకొని వ్రతం పూర్తి చేస్తారు. తర్వాత ఆ తల్లీకూతుళ్లు మంచి ధనధాన్యాలతో తులతూగుతారు. పూజ చేసే వాళ్ళు ఒకటవ గురువారం - పులగం, రెండవ గురువారం- అట్లు, మూడో గురువారం -పరమాన్నం, నాలుగో గురువారం- చిత్రాన్నం, ఐదో గురువారం- పూర్ణాలు చేసి నైవేద్యం పెట్టాలి.
భక్తి శ్రద్ధలతో పూజ చేసి తల్లి అనుగ్రహాన్ని పొందుదాము.
గమనిక:- పూజ చేసుకునేటప్పుడు, నవరాత్రులు పూజ చేసుకునే విధంగా ఒక పీటకు పసుపు రాసి, బియ్యప్పిండితో పద్మం ముగ్గు వేసి, పసుపు, కుంకుమలతో అలంకరించి ఎఱ్ఱని జాకెట్ ముక్క పీట మీద నుంచి, దాని మీద బియ్యం పోసి, బియ్యం మీద అమ్మవారి పటాన్నికాని, విగ్రహం కాని పెట్టుకోవాలి. పసుపుతో గణపతిని చేసుకోవాలి. ఆ తర్వాత మీ మీ శక్తి కొద్దీ చేసుకోండి పూజని. అమ్మవారికి ఎఱుపు పూలతో కూడా పూజించాలి. ఎఱుపు ఆ తల్లికి చాలా ప్రీతికరమైనది. ఏది ఏమైనా గురువారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. మార్గశిర గురువారం చాలా ముఖ్యమైనది.
అందరూ ఆదరిస్తారని ఆశిస్తూ......
ఈ వారం ముగ్గులు :-
1) 19 చుక్కలు 10 దాక
మధ్య చుక్కలు
2) 5 చుక్కలు నాలుగు వైపులా నాలుగు వరుసలు
This is dummy text. It is not meant to be read. Accordingly, it is difficult to figure out when to end it. But then, this is dummy text. It is not meant to be read. Period.
ConversionConversion EmoticonEmoticon