శ్రీరామ నవమి విశిష్టత!

హిందువులు జరుపుకొనే పండుగలన్నిటిలో శ్రీరామ నవమికి ఓ విశిష్టత ఉంది. అదేంటంటే, సత్యవాక్కు పరిపాలకుడైన శ్రీరాముని జన్మదినం ఈరోజు. అదేవిధంగా, సీతారాముల కళ్యాణం జరిగింది కూడా ఈ రోజే! అంతేకాదు, అరణ్యవాసం, రావణ సంహారం తర్వాత సీతాసమేతంగా శ్రీరాముడు అయోధ్యలో పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఇదే!  అందుకే, చైత్రశుద్ధ నవమిని శ్రీరామ నవమిగా జరుపుకోవటం అనాదిగా మనదేశ సాంప్రదాయం. 


అయోధ్యను పరిపాలించే రఘవంశ రాజు దశరథుడికి సంతానం లేకపోవడంతో, రాజ గురువైన వశిష్ఠ మహర్షి సూచనతో పుత్రకామేష్ఠి యాగం నిర్వహించారు. యాగానికి ప్రశన్నమైన దేవతలు ఓ పాయసపాత్రను దశరథునికి ప్రసాదిస్తారు. పాత్రలో ఉన్న పాయసాన్ని మూడు సమాన భాగాలుగా చేసి దశరథుడు తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు అందజేస్తాడు. ఓ శుభముహూర్తాన ముగ్గురు రాణులూ గర్బం దాల్చగా... ఛైత్ర శుద్ధ నవమినాడు శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నలకు వారు జన్మనిచ్చారు. 




శ్రీరాముడు వసంత ఋతువులో... చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు... పునర్వసు నక్షత్రం కర్నాటక లగ్నం అభిజిత్ ముహూర్తంలో... మధ్యాహ్నం 12 గంటలకు జన్మించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహా విష్ణువు యొక్క 7వ అవతారమే శ్రీరాముడు. రావణుని అంతమొందించడానికే భూమిపై అవతరిస్తాడు. ఈ పుణ్య దినాన్నే మనం శ్రీరామ నవమిగా జరుపుకుంటున్నాం.


ఇదిలా ఉంటే, రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు తమ కులగురువైన  వశిష్టుని దగ్గర సకల విద్యలనూ అభ్యసించారు. ఒకరోజు విశ్వామిత్రునితో కలసి జనకుని రాజధానియైన మిథిలానగరం చేరారు. అక్కడ జరిగిన సీతా స్వయంవరంలో శివుని విల్లు విరచి, రాముడు సీతను చేపట్టాడు. ఇలా సీతారాముల కళ్యాణం జరిగింది కూడా ఈ రోజే! అందుకే, చైత్రశుద్ధ నవమి రోజు భద్రాచలంలో సీతారామ కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. 


ఇక వనవాస సమయంలో, సీతని అపహరించిన రావణుని సంహరించి, సీతాసమేతంగా శ్రీరాముడు అయోధ్యలో పట్టాభిషిక్తుడవుతాడు. ఈ శుభ సంఘటన జరిగింది కూడా చైత్ర శుద్ధ నవమి నాడే! 


పితృవాక్య పరిపాలకుడిగా, ఆదర్శవంతమైన కుమారుడిగా, ప్రజలను కన్న బిడ్డల్లా పాలించిన రాజుగా, భార్య ప్రేమ కోసం పరతపించిపోయిన భర్తగా, ఇలా సకల గుణాభి రాముడిలో 16 ఉత్తమ లక్షణాలున్నాయి. క్రమశిక్షణ కలిగనవాడు, వీరుడు, సాహసికుడు, వేద వేదాంతాలు తెలిసివాడు, శకల శాస్త్ర కోవిదుడు, కార్య సమర్ధుడు, చేసిన మేలును మరవనివాడు, సత్యవాక్కు పరిపాలకుడు, గుణవంతుడు, విజ్ఞాన వంతుడు, భూతదయ కలవాడు, అందగాడు, ధైరశాలి, సహనశీలి, ధీశాలి ఇన్ని లక్షణాలున్న ఒకే ఒక్క వ్యక్తి శ్రీరాముడు. మానవుడు ఎలా ఉండాలి? బంధాలను ఎలా గౌరవించాలి? బంధుత్వాలు ఎలా కాపాడుకోవాలి? అని ఆచరించి చూపించినవాడు శ్రీరామచంద్రుడు. అందుకే, భారతదేశంలో రాముడు లేని ఇల్లు, రామాలయం లేని ఊరు ఉండదంటే అతిశయోక్తి కాదు. 


రామరాజ్యంలో ప్రజలంతా సిరిసంపదలతో, సుఖ సంతోషాలతో ఉన్నారనేది హిందువుల నమ్మకం. అందుకే, ఈ పండుగని హిందువులు ఎంతో వేడుకగా చేసుకుంటారు. అంతేకాదు, రాముని జీవితంలో మూడు ముఖ్యమైన ఘట్టాలు జరిగింది కూడా ఈ రోజే కావడంతో శ్రీరామ నవమి అంటే హిందువులకి ఎంతో ప్రత్యేకం. సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది. శ్రీరాముడు జన్మించింది మధ్యాహ్న సమయం కాబట్టి... శ్రీరామ నవమి రోజు మధ్యాహ్న సమయంలోనే ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్థ గోళానికి చేరువగా వస్తాడు. ఈ కారణంగానే, శ్రీ రామనవమి రోజున పానకం-వడపప్పు తయారు చేసి మహా ప్రసాదంగా స్వీకరిస్తారు. 



నవమి రోజున చేసే పానకం-వడపప్పు వెనుక ప్రకృతి నియమం కూడా ఒకటి ఉంది. ఇది వేసవికాలం కాబట్టి, ప్రసాదరూపంలో వీటిని సేవించడం వల్ల ఆరోగ్యం, ఆయుష్షు అభివృద్ధి చెందుతాయని ఆయుర్వేద పండితుల అభిప్రాయం. మన ప్రసాదాలన్నీ కాలానుగుణంగా, ఆరోగ్యాన్ని నిర్ణయించేవే! పానకం-వడపప్పు కూడా అంతే! ఈ ఋతువులో వచ్చే గొంతు వ్యాధులకు పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని లౌకికంగా చెబుతారు. అంతేకాక, పానకం విష్ణువుకి ప్రీతిపాత్రమైంది. ఇక పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును ‘వడపప్పు’ అని అంటారు. ఈ వడపప్పు మండే ఎండల్లో 'వడదెబ్బ' కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం. 

శ్రీరామ నవమి పండగను భద్రాచలంలో ఏ రోజైతే చేస్తారో... అదే రోజు అన్ని ప్రాంతాల వారు జరుపుకోవటం మొదటినుంచీ ఆనవాయితీగా వస్తుంది. శ్రీరామనవమి రోజున ఉదయం ఆరు గంటలకే నిద్రలేచి, తలంటు స్నానం చేసి, కొత్త బట్టలు ధరించాలి. ఇల్లు, పూజామందిరం శుభ్రం చేయాలి. పూజామందిరంలో శ్రీరాముని ప్రతిమను గానీ, పటాన్నిగానీ పెట్టి… పూలు, పండ్లు, నైవేద్యానికి పానకం, వడపప్పు, వంటివి సిద్ధం చేసుకోవాలి. అలాగే పూజకు ముందు శ్రీరామరక్షా స్తోత్రం, శ్రీరామ అష్టోత్తరం, శ్రీరామాష్టకం, శ్రీరామ సహస్రము, శ్రీమద్రామాయణం వంటి స్తోత్రాలతో శ్రీరాముడిని స్తుతించాలి. ఇంకా శ్రీరామ పట్టాభిషేకం వంటివి పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి.


అలాగే, దేవాలయం దర్శించుకోవడం కూడా మంచిదే! దేవాలయాల్లో పంచామృతములతో అభిషేకం, శ్రీరామ ధ్యాన శ్లోకములు, శ్రీరామ అష్టోత్తర పూజ, సీతారామ కళ్యాణం వంటి పూజా కార్యక్రమాలు జరిపిస్తే... అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావడంతో పాటు, సకల సంపదలు చేకూరుతాయి. అలాగే శ్రీరామనవమి రోజున శ్రీ రాముని కథ, వ్రతమును ఆచరించడం మంచిది.

 

ఇవేకాక, ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తుంటారు. గ్రామాల్లో అయితే పేద, ధనిక అనే బేధం లేకుండా రాములవారి ప్రసాదాన్ని స్వీకరించటం పరిపాటి. ఈ శ్రీరామనవమి వేడుకలు హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగా వైభవంగా సాగుతాయి. వీధులలో చలువ పందిళ్లు వేసి, సీతారామ కళ్యాణం జరిపిస్తారు.


Previous
Next Post »