గోంగూర పప్పు కమ్మగా రుచిగా రావాలంటే ఇలా చేయాల్సిందే

గోంగూర పప్పు

కావలసిన పదార్థాలు:

 కంది పప్పు- 250 గ్రాములు
 గోంగూర - 1 కట్ట (మంచి గోంగూర)
 ఉల్లిపాయ - ఒకటి పెద్ద సైజు
 పచ్చిమిర్చి- 5
 పసుపు-  చిటికెడు
 ఉప్పు- తగినంత
 కారం - తగినంత
 నూనె - 5 టీ స్పూన్లు
 ఆవాలు - ఒక టీ స్పూను
 పొట్టు మినపప్పు- 1 స్పూన్
 జీలకర్ర - ఒక టీ స్పూను
 మెంతులు - చిటికెడు గింజలు
 కరివేపాకు - ఒక రెబ్బ

 తయారుచేయు విధానం:-   ముందుగా మందపాటి గిన్నె తీసుకొని అందులో కందిపప్పు వేసి, తగినంత నీరు పోసి ఉడకనివ్వాలి.  పప్పులు పట్టుకొని చూస్తే మెత్తగా ఉండాలి.  గోంగూరను వలిచి శుభ్రంగా కడిగి, తరిగి ఉంచుకోవాలి. ఉల్లిపాయను చిన్న ముక్కలుగా, మిర్చి కూడా అలాగే చిన్న ముక్కలుగా కోసి ఉంచుకోవాలి. పప్పు మెత్తబడ్డ (మరీ ఎక్కువగా  ఉడకకూడదు ) తర్వాత ముందుగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు వేసిన తర్వాత గోంగూరను కూడా వేసి మూత పెట్టి ఉంచాలి. ఒక ఇరవై నిమిషాలు అయిన తర్వాత ఉప్పు కూడా వేసి మళ్లీ మూత పెట్టండి. నీళ్లు సరిపడా ఉన్నది లేనిది చూసుకోవాలి. నీరు లేకపోతే మాడుతుంది. అది చూసుకుంటూ ఉండాలి. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత చూస్తే బాగా గోంగూర ఉడికి ఉంటుంది. తర్వాత అందులో సరిపడా, మీకు కావలసినంత పొడి కారం వేసుకుని బాగా మెదిపి దించుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి, ఐదు చెంచాల నూనె వేసి, అందులో ఆవాలు, పొట్టు మినప్పప్పు, జీలకర్ర, మెంతులు వేసి బాగా వేగనిచ్చి, కరివేపాకు వేసి, దించి పప్పులో వేసి బాగా కలుపుకొని, అన్నం లో, నెయ్యి వేసి కలుపుకుని తినండి. ఏ పప్పు కూడా గోంగూర పప్పు తో సరికాదు. గోంగూర పప్పు రుచి అంత అమోఘం. 




గోంగూర లో రెండు రకాలు ఉంటాయి ఒకటి "కొండ గోంగూర", రెండోది " మంచి గోంగూర ". పాత రోజుల్లో మంచి గోంగూర నే వాడతారు.  కొండ గోంగూర పైత్యం అని పెద్దవాళ్లు అనేవాళ్ళు.

Previous
Next Post »