దోసకాయ పచళ్ళు - రకాలు, దోస ఆవకాయ

దోస ఆవకాయ

కావలసిన పదార్థాలు:-


దోస కాయలు - 250 గ్రాములు బాగా గట్టివి
ఆవపిండి - మూడు టేబుల్ స్పూన్లు
మెంతిపిండి - ఒక టేబుల్ స్పూను
ఇంగువ - ఒక టేబుల్ స్పూను
ఉప్పు- తగినంత
కారం - తగినంత
పసుపు - చిటికెడు
నూనె - సరిపడా
ఆవాలు - రెండు టీ స్పూన్లు
నిమ్మకాయ - ఒకటి


తయారుచేయు విధానం:- ముందుగా గట్టిగా ఉన్నా దోసకాయను తీసుకొని చేదు చూసిన తర్వాత (బాగున్నది మాత్రమే తీసుకోవాలి )తరువాత వాటిలో గింజలు, గుజ్జు తీసి వేయాలి. తర్వాత దోసకాయ చెక్కు తీయకుండా చిన్నగా ముక్కలు కోసుకోవాలి. ఈ కోసిన వాటిని ఒక గిన్నెలో పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక బేసిన్ తీసుకొని అందులో తగినంత ఉప్పు, కారం కొద్దిగా ఆవపిండి, 1 స్పూన్ మెంతిపిండి, చిటికెడు పసుపు వేసి బాగా కలిపి ఉంచాలి.

నేను ఉప్పు, కారం, ఆవపిండి అన్నీ ఉజ్జాయింపుగా వేస్తాను. కొంతమంది ఎక్కువ ఉప్పు, కారాలు, కొంతమంది తక్కువ ఉప్పు కారాలు తింటారు కదా. అందుకని తగినంత అని చెప్పాను. తర్వాత తరిగి ఉంచుకున్న దోసకాయ ముక్కలను, కొంచెం నూనె పట్టిన తర్వాత, కలిపి ఉంచుకున్న కారం, ఉప్పు, ఆవపిండిలో వేసి బాగా కలిపి కొంచెం కూడా నూనె వేసి కలపాలి. తరువాత ఒక నిమ్మకాయ పిండుకోవాలి. పులుపు అనుసరించి మీ ఇష్టాన్ని బట్టి కలుపుకోవాలి. ఒక ఐదు గంటలు పక్కన మూతపెట్టి ఉంచితే చాలు, రుచికరమైన దోస ఆవకాయ రెడీ. ఫ్రిజ్ లో ఉంచుకుంటే నెల రోజుల దాకా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కలుపుకుని ఆస్వాదించండి.




దోసకాయ వేయించి చేసే రోటి పచ్చడి


కావలసిన పదార్థాలు:


దోసకాయ - ఒకటి గట్టిగా చేదు లేనిది

నూనె - రెండు టీ స్పూన్లు

పచ్చి మిర్చి - 9

చింతపండు - తగినంత

ఉప్పు- తగినంత

పసుపు - చిటికెడు

కొత్తిమీర - 2 రెబ్బలు


తయారుచేయు విధానం:- పాతరోజుల్లో దీన్ని "దోసకాయ బజ్జి " అని అంటారు. ఆ రోజుల్లో కుంపట్లు ఉండేవి కదా అందుకని దోసకాయను కుంపట్లో నిప్పుల మీద వేసి మెత్తబడే లాగా నిప్పుల మీద కాలుస్తారు. ఇప్పుడు కుంపట్ల ఏవి లేవు కాబట్టి ఇప్పటి పద్ధతిలో చేసేది చెబుతాను.

దోసకాయ చెక్కు తీసి గింజలు, గుజ్జు అన్ని తీయాలి. గింజలు, గుజ్జు తీసి ఒక గిన్నెలో ఉంచుకోవాలి. తర్వాత దోసకాయను పల్చగా చెప్పినట్టు తరగాలి. తర్వాత బాండిలో రెండు చెంచాల నూనె వేసి అందులో తరిగిన దోసకాయ ముక్కలను వేసి వేయించాలి. బాగా వేగిన తర్వాత దించండి. ఇప్పుడు రోటిలో పచ్చిమిర్చి, చింతపండు, పసుపు, ఉప్పు వేసి బాగా మెత్తగా దంచాలి. అవి నలిగిన తర్వాత వేయించిన దోసకాయ ముక్కలు, కొత్తిమీర రెబ్బలు వేసి బాగా దంచుకోవాలి. తరువాత దోసకాయ గింజలు, గుజ్జు, రోటిలో వేసి మళ్ళీ బాగా కలపండి. చివర్లో మళ్లీ ఒకసారి ఉప్పు చూసుకోండి. అంతే రుచికరమైన దోసకాయ రోటి పచ్చడి రెడీ. ఇంకా మీదే ఆలస్యం ఆరగించండి.




దోసకాయ పెరుగు పచ్చడి


కావలసిన పదార్థాలు:


దోసకాయ - ఒకటి గట్టిగా చేదు లేనిది

పచ్చికొబ్బరి - ఐదు టేబుల్ స్పూన్లు

ఆవాలు - ఒక టేబుల్ స్పూను

కొబ్బరి నూనె - రెండు టేబుల్ స్పూన్లు

పచ్చిమిర్చి- 3

ఎండుమిర్చి - ఒకటి

కరివేపాకు - ఒక రెబ్బ

పెరుగు - 7 చెంచాలు.


తయారుచేయు విధానం:- ఈ పెరుగు పచ్చడి మీరు ఇంతవరకు తిని ఉండకపోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. పచ్చిమిర్చి నేను ౩ వేసాను, మీరు కారం అనుసరించి మీరు పెంచుకోవచ్చు.

ముందుగా దోసకాయను చెక్కు తీసి, గింజలు తీసివేసి, దోసకాయ చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. తర్వాత ఆ ముక్కలను కుక్కర్లో వేసి, ఒక పావు గ్లాసు నీళ్లు పోసి, కొంచెం ఉప్పు వేసి ఒక విజిల్ వచ్చే అంతవరకు ఉంచి స్టవ్ కట్టేయాలి.




తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి, పచ్చిమిర్చి వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పటికే కుక్కర్ విజిల్ పోయి ఉంటుంది. మూత తీసి గరిటతో ముక్కల్ని బాగా మెదపాలి. తర్వాత ముక్కల మీద గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి మళ్ళా స్టౌ మీద ఉంచి బాగా రెండు నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత స్టౌ సిమ్లో ఉంచి అందులోకి పెరుగును కలపాలి. స్టౌ హైలో పెడితే పెరుగు ఇరిగి పోతుంది, అందుకని సిమ్ లో నుంచి పెరుగుపచ్చడి వేడెక్కడం గానే స్టౌ మీదనుంచి దించాలి. తర్వాత స్టవ్ మీద బాణీ ఉంచి అందులో కొబ్బరి నూనె వేసి అందులో ఆవాలు, ఎండు మిర్చి వేసి వేగిన తరవాత కరివేపాకు వేసి పెరుగు పచ్చడిలో వేసి కలపాలి. ఉప్పు మాత్రం మర్చిపోకుండా చివర్లో మరో ఒకసారి చూసుకోండి. అంతే ఎంతో రుచి కరమైన దోశ పెరుగు పచ్చడి తయారు.

పెరుగు పచ్చడి లో పెరుగు కలిగే టప్పుడు గడ్డలు లేకుండా బాగా చూసుకోండి. మీరు చేసుకుంటే తిని మీకు నచ్చిందో లేదో కామెంట్ పెట్టండి.

Previous
Next Post »