యుగాలు మారినా ఉగాది హిందువులకి ఎందుకు ప్రత్యేకం?



‘ఉగాది’ ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది ఇది మన తెలుగువారి  పండుగ అని. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగు ప్రజలు జరుపుకునే మొట్టమొదటి పండుగ. హిందువుల కాలెండర్ ప్రకారం, చైత్ర మాసాన్ని మొదటి నెలగా భావిస్తారు. అందుకే, ఈ మొదటి నెల ప్రారంభమయిన మొదటి రోజే… అంటే… చైత్ర శుద్ద పాడ్యమి రోజున ఊగాది పండుగ జరుపుకుంటారు.


ఉగాది అంటే… ఉగ + ఆది = ఉగాది. ‘ఉగ’ అంటే... నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్షు అని వేర్వేరు అర్థాలు వస్తాయి.  ‘ఆది’ అంటే...  మొదలు. టోటల్ గా “ఉగాది” అంటే… ప్రపంచం మొదలైనరోజు; లేదా  జన్మ ప్రారంభమైన రోజు; లేకుంటే ఆయుష్షు ఆరంభమైన రోజు. ఇంకొకవిధంగా చెప్పాలంటే, ఉత్తరాయణం, దక్షిణాయణం ల కలయిక.   ఇంకా వసంత కాలాన్ని స్వాగతించడం.


ఉగాది ప్రాముఖ్యత:


హిందువులు ఉగాది పండుగ జరుపుకోవడం వెనుక ఒక ప్రాముఖ్యత ఉంది. అదేంటంటే, సరిగ్గా చైత్ర శుద్ధ పాడ్యమి రోజునే... బ్రహ్మ సృష్టిని ప్రారంభించారని నమ్ముతారు. అయితే, అదేరోజు సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మ వద్ద నుండి వేదాలను దొంగిలించి, సముద్రంలో వెళ్లి దాక్కుంటాడు. ఆ వేదాలు తన దగ్గర లేకపోవడంతో, సృష్టిని తయారుచేసే సామర్ధ్యాన్ని కోల్పోతాడు బ్రహ్మ. అందుకే, ఈ విషయాన్ని విష్ణుమూర్తి వద్ద మొరపెట్టుకుంటాడు. వెంటనే, విష్ణువు మత్స్యావతారము ధరించి... సోమకుని  సంహరించి... వేదాలను బ్రహ్మకి అప్పగిస్తాడు. ఈ సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చిందని పురాణప్రతీతి. 


బ్రహ్మదేవుడు చైత్ర మాస... శుక్లపక్ష ప్రథమ దినాన... సూర్యోదయ వేళ... ఈ జగత్తుని సృష్టించాడంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస, వర్ష, వర్షాధికులను కూడా ఈ రోజే సృష్టించాడు అనేది మన పూర్వీకుల నమ్మకం. అంతేకాదు, వసంత ఋతువు కూడా ఈరోజే మొదలవుతుంది. అందుకే, కొత్త జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు. 


శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఈ రోజే కావడంతో, ఈ పండుగ ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరొక గాధ ఉంది. 




ఉగాది ఆచారాలు:


ఈ పండుగని ఒక్క తెలుగువాళ్ళే కాక, తమిళులు పుత్తాండు అనే పేరుతోను, మలయాళీలు విషు అనే పేరుతోను, కన్నడిగులు ఉగాది పేరుతోనూ, మరాఠీలు గుడి పడ్వాగా అనే పేరుతోనూ, సిక్కులు వైశాఖీ అనే పేరుతోనూ, బెంగాలీలు పొయ్‌లా బైశాఖ్ అనే పేరుతోనూ జరుపుకుంటారు. ఎవరు ఏ పేరుతో పిలిచినా… అన్ని ప్రాంతాల వాళ్ళూ జరుపుకోనేది ఈ ఒక్క ఉగాది పండగనే! ప్రతి రాష్ట్రంలోనూ ఇది ఉదయాన్నే వచ్చి... రాత్రి వరకూ ఉండి వెళ్లిపోతుంది. కానీ, పండుగ చేసుకునే విధానంలో మాత్రం ఆ ప్రాంతం యొక్క ఆచార వ్యవహారాలని బట్టి రాష్ట్రానికీ, రాష్ట్రానికీ మద్య వ్యత్యాసాలు ఉంటాయి. 

\



ఉగాది సాంప్రదాయాలు:


ఉగాది అంటేనే నూతన సంవత్సరాది కాబట్టి, పండుగని కూడా అంతే నూతనంగా ఆహ్వానించాలి. అందుకే ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్ళల్లో వారం రోజుల నుండే సన్నాహాలు ప్రారంభమవుతాయి. ఇంటిని, శుభ్రపరచుకోవడం. మురికి బట్టలు లేకుండా చేయడం, ఇంట్లో చెత్తా చెదారం లేకుండా తొలగించడం వంటి పనులతో వారం నుండే సన్నాహాలు ప్రారంభమవుతాయి. ఇలా చేయడంవల్ల ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ మొత్తాన్ని తరిమివేసి, పండుగని నూతనంగా ఆహ్వానిస్తారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ శుభ్రపరచే విధానంలో కుటుంబసభ్యులు అందరూ పాలుపంచుకోవడం వలన వారి మద్య సన్నిహిత సంబంధాలు మెరుగవుతాయి.



ఉగాది పచ్చడి ప్రాముఖ్యత:


మనదేశంలో జరుపుకొనే ఏ పండుగ అయినా ఆయా కాలాలను అనుసరించి తయారుచేసే సాంప్రదాయక ఆహారానికి ప్రాముఖ్యతని ఇస్తాయి. అదే విధంగా వేసవికాలo అడుగుపెట్టబోతుంది అనడానికి సూచనగా ఉదయాన్నే మామిడి, చింతపండు, బెల్లం, వేప పువ్వు, ఉప్పు, మిరియాలు వీటన్నిటినీ కలిపి చేసిన షడ్రుచుల సంగమం అయిన ఉగాది పచ్చడిని సేవించడం ద్వారా నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తారు. కోపం, హాస్యం, ఆశ్చర్యం, భయం, ధైర్యం, సున్నితత్వం వంటి భావార్ధాలకి ప్రతీకగా ఈ షడ్రుచులను చెప్తుంటారు. ఈ షడ్రుచుల సమ్మేళనమే మన జీవితం అనే అర్ధాన్ని తెలియచేసేదే ఉగాది పచ్చడి. 


బెల్లం - తీపి - ఆనందానికి సంకేతం

ఉప్పు - రుచి - ఉత్సాహానికి సంకేతం

వేప పువ్వు - చేదు - బాధకి సంకేతం 

చింతపండు - పులుపు - నేర్పుకి సంకేతం

పచ్చి మామిడి ముక్కలు - వగరు - కొత్త సవాళ్లకి సంకేతం

మిరియాలు - కారం - సహనానికి సంకేతం


ఉగాది పంచాంగ శ్రవణం: 


పంచాంగ శ్రవణం వినని ఉగాది పూర్తైనట్లు కాదు అని మన పూర్వీకుల నమ్మకం. రాబోయేకాలంలో తమ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో పంచాంగ శ్రవణ కర్తలు గుళ్లలో కానీ, లేదా ఇళ్లల్లో కానీ చెప్పడం ఆనవాయితీగా వస్తున్నది. వీరిచ్చే సూచనల ఆధారoగా సంవత్సరంలో కీలకమార్పులకు ఆలోచనలు చెయ్యగలరని పెద్దల విశ్వాసం. ఈ పంచాంగ శ్రవణం అనేది ఉగాదిరోజు సాయంత్రం వేళల్లో చేస్తుంటారు. ఈ సందర్భంగా ప్రజలంతా ఒకచోట సమూహంగా ఏర్పడటం వల్ల వారి మద్య సన్నిహిత సంబంధాలు మెరుగయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఉగాది పండుగ ప్రజల మద్య సన్నిహిత సంబంధాలను మెరుగుపరచడానికి వేదికగా ఉంది.


Previous
Next Post »