పప్పు లేకుండ దోసకాయ ముక్కల పులుసు, దోసకాయ ముక్కల పచ్చడి.

 

1) దోసకాయ ముక్కల పులుసు 

 


కావలసిన వస్తువులు

 దోసకాయ  - ఒకటి చేదు లేకుండా ఉన్న గట్టి కాయ.

చింతపండు - చిన్న నిమ్మకాయంత.

 ఉప్పు- తగినంత.
 పసుపు - చిటికెడు.
 కారం- కావలసినంత.
 బెల్లం - చిటికెడు.
 నూనె - మూడు టీ స్పూన్లు.
 ఆవాలు - ఒక టీ స్పూను.
 జీలకర్ర - ఒక టీ స్పూను.
 ఇంగువ - పావు టీ స్పూన్ కన్న తక్కువ.
 కొత్తిమీర - ఒక  రెబ్బ.
 కరివేపాకు - ఒక రెబ్బ.

తయారు చేయు విధానము :-   ముందుగా ఒక గిన్నెలో కొంచెం ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని, అందులో చిటికెడు పసుపు, చింతపండు వేసి నానబెట్టి ఉంచుకోవాలి. తర్వాత దోసకాయ చెక్కు తీసి గింజలు తీసి వేయాలి. గింజలు అన్ని తియ్యకూడదు, గింజలు ఉండి లేనట్టుగా ఉండాలి. తరువాత దోసకాయను మరీ పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా ముక్కలు తరిగి ఉంచుకోవాలి.

 తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకొని స్టౌ వెలిగించి, స్టౌ మీద పెట్టుకొని అందులో తరిగిన దోసకాయ ముక్కలు వేసి, పసుపు నీళ్లలో నాన పెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జును బాగా పిసికి, దోసకాయ  ముక్కలు ఉన్న గిన్నెలో పోయాలి. నీరు చాలకపోతే విడిగా ఒక గ్లాసు నీరు తీసుకొని ముక్కలు మునిగేలా పోసుకోవాలి. అందులో సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి ఒక పావుగంట గడిచిన తర్వాత మూత తీసి చూస్తే ముక్కలు బాగా ఉడికి ఉంటాయి.  ముక్కలు మెత్తబడ్డ తరువాత సరిపడా కారం, చిటికెడు బెల్లం వేసి ఇంకొక 5 నిమిషాలు  ఉడకనివ్వాలి.  నీరు చాలకపోతే మీ ఇష్టాన్ని అనుసరించి కొంచెం కలుపుకోండి, వద్దంటే వద్దు. తరవాత పులుసు గిన్నె దించి స్టవ్ మీద బాండీ పెట్టుకొని, అందులో మూడు చెంచాల నూనె వేసి అందులో ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర వేసి వేగిన తర్వాత కరివేపాకు వేసి  స్టౌ కట్టేయాలి. స్టవ్ కట్టేసిన తర్వాత అందులోకి సన్నగా తరిగి ఉంచుకున్న కొత్తిమీర, ఇంగువ పొడి వేసి కలుపుకోవాలి. అంతే గుమగుమలాడే నోటికి రుచి కరమైన దోసకాయ పులుసు రెడీ.

2) దోసకాయ ముక్కల పచ్చడి


 కావలసిన పదార్థాలు:-


 దోసకాయ - ఒకటి మీడియం సైజు.
 పచ్చిమిర్చి- మూడు లేక ఐదు.
 ఎండుమిర్చి- 3 
 చింతపండు -కుంకుడు కాయంత.
 పొట్టు మినపప్పు- మూడు టీస్పూన్లు.
 ఉప్పు- తగినంత.
 నూనె - మూడు టీస్పూన్లు.
 పసుపు - చిటికెడు.
 ఇంగువ పొడి - చిటికెడు.
 కొత్తిమీర - ఒక రెబ్బ.

తయారు చేయు విధానము:-  ముందుగా దోస కాయలు చేదు చూసి తర్వాత చెక్కు తీసి చిన్న ముక్కలుగా తరగాలి. దోసకాయలోని గింజలు, గుజ్జుల పక్కన ఒక ప్లేట్లో ఉంచుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి, బాండీ పెట్టి అందులో మూడు టీ స్పూన్ల నూనె వేసి అవి వేడెక్కిన తరువాత అందులో మినపప్పు వేసి అది కొంచెం  వేగేటప్పుడు అందులో ఎండు మిర్చి వేసి వేయించి దించుకోవాలి.   అది దించిన తర్వాత అందులో ఇంగువ చేర్చుకోవాలి. ఇప్పుడు రోలు, పచ్చడి  బండ, కడిగి శుభ్రం చేసుకొని ముందుగా పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు, పసుపు వేసి బాగా  దంచుకోవాలి. తర్వాత అందులో వేయించిన ఎండు మిర్చి వేసి మరలా బాగా కలిసేలా దంచుకోవాలి. ఇవన్నీ బాగా నలిగిన  తరువాత తరిగి ఉంచుకున్న దోసకాయ ముక్కలను కొంచెం ముక్కలు తీసి రోటిలో వేసి బాగా నూరుకోవాలి.  తరువాత మిగతా   ముక్కలను  అందులో వేసి బాగా కలిసేలా పచ్చడి బండతో బాగా కలియతిప్పాలి.  ఇలా తిప్పటం వల్ల పచ్చడి  బాగా కలుస్తుంది. ఇప్పుడు బాండీలో మిగిలిన నూనె, మినప్పప్పు, ఇంగువ, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. కొంతమందికి మినప్పప్పు పంటికింద తగులుతుంటే చాలా ఇష్టం. నేను చెప్పింది అదే రకం. ఎవరి ఇష్టం వాళ్ళది. చివర్లో ఉప్పు సరిపోయిందా చూసుకొని ఆరగించండి.  అంతే ఎంతో రుచికరమైన దోసకాయ రోటి పచ్చడి (ముక్కల) రెడీ.

 ఆరోగ్యం బాగా లేనప్పుడు, జలుబు అయినా,జ్వరం వచ్చి తగ్గిన తరువాత ఈ దోసకాయ వంటలు చాలా రుచిని ఇస్తాయి.

ఆస్వాదించండి, ఆరగించండి, ఆనందించండి.


Previous
Next Post »

1 Comments:

Click here for Comments
Unknown
admin
7 మార్చి, 2021 11:08 PMకి ×

What is the white color item in the first image?

Congrats bro Unknown you got PERTAMAX...! hehehehe...
Reply
avatar