పాతరోజుల్లో బీపీలు, షుగర్, కొలెస్ట్రాల్, అసిడిటీ, గ్యాస్ ట్రబుల్, అజీర్ణం ఇలాంటివి ఎవరికీ తెలియవు. డాక్టర్స్, హాస్పిటల్స్ చాలా తక్కువ. రోగాలు తక్కువ. ఓపికున్నంత వరకు పనిచేయడం కావలసింది శుభ్రంగా తినడం, తిరగడం అంటే దీనికి కారణం వాళ్ళు తినే ఆహారం, వండే విధానం. రుచులు తగ్గవు, రోగాలు రావు. అలాంటి పాతకాలం నాటి ఉప్పు, కారం, నూనెలు, తక్కువగా మసాలాలు లేని రుచికరమైన వంటలు మీకు తెలియజేస్తాను.
ముందుగా దోసకాయతో రకాలు:-
మసాలాలు లేకుండా నోటికి రుచిని, మనస్సుకి సంతోషాన్ని, పొట్టకు ఆరోగ్యాన్నిచ్చే పాత తరం వంటలు.
దోసకాయ కూర:-
కావలసినవి-
పచ్చిమిర్చి- 3
ఉప్పు తగినంత
పసుపు చిటికెడు
నూనె - ఒక టీ స్పూన్
ఆవాలు - ఒక టీ స్పూను
పొట్టు మినపప్పు - ఒక టీ స్పూను
కరివేపాకు - రెండు రెబ్బలు.
గమనిక - దోసకాయ తరిగేటప్పుడు చేదో పండో చూసుకోవాలి. బాగుంటే కనుక మరీ పెద్దవి, మరీ చిన్నవి కాకుండా ముక్కలు తరుక్కోవాలి. అలాగే గింజలను పూర్తిగా తియ్యకూడదు. అక్కడక్కడ కొన్ని గింజలు ఉండాలి. దోసకాయ తరిగిన తర్వాత దాని తొక్కలు, గింజలు, చెట్లలో వేసుకుంటే మంచిది. ఇంకెందుకు ఆలస్యం తయారు చేసే విధానం చూద్దాం రండి. మిర్చికావాలంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు.
తయారు చేసే విధానం- ముందుగా స్టవ్ వెలిగించి, మందపాటి గిన్నెను స్టవ్ మీద ఉంచాలి. దానిలో నూనె, ఆవాలు, మినపప్పు వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత కరివేపాకు వేసి, తరిగి ఉంచుకున్న దోసకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు గిన్నెలో వేయాలి. తర్వాత అందులో కూర కి సరిపడా ఉప్పు,పసుపు వేసి కలపాలి. తర్వాత కొంచెం నీరు (ముక్కలు ఉడకటానికి) చిలకరించి మూత పెట్టి స్టవ్ సిమ్లో ఉంచండి. ఒక పదిహేను నిమిషాలు గడిచే సరికి నోటిలో లాలాజలం ఊరేలా కమ్మటి వాసన వస్తుంది. ముక్కలు మెత్తబడి నీరు ఇంకితే సరిపోతుంది. చివర్లో ఉప్పు సరి చూసుకోండి. కావలసి వస్తే కొంచెం వేసుకోండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ కూర కలుపుకొని తింటే, ఆ ఒక్క కూర తోనే అన్నమంతా తినేస్తారు. పిల్లలు, పెద్దలు అందరూ బాగా ఇష్టంగా తినే రుచికరమైన కూర ఇది. నేను రాసే వంటలన్నీ బ్యాచులర్స్ కూడా తేలిగ్గా చేసుకొని ఆస్వాదించవచ్చు.
దోసకాయ పప్పు:-
కావలసినవి
కందిపప్పు- 250 గ్రాములు
పచ్చిమిర్చి- 3
చింతపండు - కుంకుడు కాయంత
ఉప్పు -తగినంత
కారం -సరిపడా
కరివేపాకు రెండు రెమ్మలు
ఆవాలు- ఒక టీ స్పూను
పొట్టు మినపప్పు- ఒక టీ స్పూను
నూనె మూడు -టీ స్పూన్లు.
తయారు చేసే విధానం- ముందుగా మందపాటి గిన్నెలో కందిపప్పు వేసి బాగా కడిగి, నీళ్లు పోసి స్టౌ వెలిగించి, స్టవ్ మీద ఉంచి ఉడికించుకోవాలి. ఒక పొంగు వచ్చిన తరువాత స్టౌ సిమ్ లో మూతపెట్టాలి. మూత కొంచెం తెరిచి ఉంచాలి. కొంత సేపటికి పప్పు సగానికి పైన ఉడికి ఉంటుంది. పప్పుని గరిటెతో తీసి నొక్కి చూస్తే మెత్త బడాలి. అప్పుడు పప్పు ముక్కలు వేసే విధంగా తయారయింది అన్నట్లుగా అర్థం చేసుకోవాలి. అలా అయి ఉంటే పప్పులో దోసకాయ ముక్కలు, చింతపండు, పసుపు, ఉప్పు వేసి మూత పెట్టి ఉంచాలి. నీరు ఉందో లేదో చూసుకోవాలి. కొంతమందికి పప్పు లూస్ గా ఉంటే ఇష్టం. కొంతమందికి పప్పు కొంచెం గట్టిగా ఉండాలి. అది వాళ్ళకి ఇష్టాన్ని అనుసరించీ నీళ్ళు కలుపుకోవాలి. ఒక పావు గంట కి పప్పు మూత తీసి చూస్తే చక్కగా ముక్క మెత్తబడి ఉంటుంది. తర్వాత దానిలోకి సరిపడా కారం వేసి కలిపి దించుకోవాలి. నేనైతే ఐస్క్రీమ్ స్పూన్ తో స్పూన్ కారం వేస్తాను. ఆశీర్వాద్ కారం వాడతాను. మీకు ఎంత కావాలంటే అంత కారం వాడవచ్చు. తర్వాత ఒక పాన్ స్టౌ మీద ఉంచి అందులో నూనె వేసి వేడి చెయ్యాలి. అది వేడెక్కిన తర్వాత అందులోకి మినప్పప్పు, ఆవాలు, వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత కరివేపాకు వేసి పప్పు లో వెయ్యాలి. చివర్లో ఉప్పు చూసి కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు. ముందే ఎక్కువ అయితే అంతా వేస్ట్ కదా ? ఇప్పుడు వేడి వేడి అన్నంలో దోసకాయ పప్పు, నెయ్యి వేసి కలిపి తింటే " ఆహా ఏమి రుచి అనరా మైమరచి" అని అనక మానరు ఇంకెందుకు ఆలస్యం పప్పు వాసన తోనే కడుపు నిండిపోతుంది. ఆరగించండి ఆస్వాదించండి ఆనందించండి.
వచ్చేవారం దోసకాయ పచ్చడి, దోసకాయ పులుసు. మీకు నచ్చితే కామెంట్ పెట్టండి.



ConversionConversion EmoticonEmoticon