రోగ నిరోధక శక్తి పెరగటానికి రాగి పానీయం

  ఎముకలు గట్టితనానికి, బలానికి, జుట్టు బాగా పెరగడానికి, రోగ నిరోధక శక్తి పెరగటానికి రాగులతో రకాలు.




ఇంకొక 20 రోజుల్లో చలికాలం పూర్తయి ఎండాకాలంలోకి అడుగు పెట్టబోతున్నాము. బజార్ లో కూడా పుచ్చకాయలు వస్తున్నాయి. పుచ్చకాయల రాక ఎండాకాలం రాకకు సంకేతం. ఒక కాలం నుంచి ఇంకొక కాలానికి అడుగు పెడుతున్నా మంటే మన ఆరోగ్యంలో కూడా మార్పులు మొదలవుతాయి అని అర్థం. ఈ మార్పుల వల్ల జలుబు, దగ్గు, విరోచనాలు వాంతులు, జ్వరాలు మొదలవుతాయి. మానవ శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గటం వలన ఇవన్నీ రావటానికి అవకాశం ఉంటుంది. మానవ శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి ఈ ఎండాకాలం అంతా ఇబ్బంది పడకుండా హాయిగా సంతోషంగా గడవడానికి "రాగుల పానీయం" గురించి వివరంగా చెప్తాను. కానీ నేను చెప్పేవన్నీ మా అమ్మ వాళ్ల కాలం నాటివి. వాళ్ల పద్ధతులు మనకు ఎప్పటికీ బంగారు బాట లాంటిది. ఇది ఎవరు కాదనలేని జగమెరిగిన సత్యం.

రాగుల పానీయం:-




రాగి పానీయం తయారు చేయుటకు ముందుగా రాగి పిండి తయారు చేసే విధానం చెప్తాను. ముందుగా ఒక్క కిలో రాగులు తీసుకొని రాళ్ళు, రప్పలు ఏమీ లేకుండా శుభ్రం చేసుకొని మరుసటి రోజు ఉదయాన్నే రాగులు ఒక గిన్నెలో పోసి నిండుగా నీరు పోసి ఉంచవలెను. మరుసటి రోజు దానిని చిల్లుల పళ్లెంలో వేసి నీరంతా పోయిన తరువాత ఆ రాగులు ఒక పొడి క్లాత్ తీసుకొని అందులో వేసి మూట కట్టి దాని మీద బరువు పెట్టి ఉంచాలి. పాత రోజుల్లో పొత్రాన్ని బరువుగా పెట్టేవారు. మీ మీ అవకాశాలను అనుసరించి బరువులు పెట్టండి. అలా బరువు పెట్టి ఉంచిన తరువాత మూడవ రోజున ఆ మూను తీసి చూస్తే ఆ రాగులకు మొలకలు వచ్చి ఉంటాయి. వాటిని ఒకటి, రెండు రోజులు ఆరబెట్టాలి. ఆరిన తరువాత చేతితో తీసుకొని నలిపితే ఆ మొలకలు అన్నీ రాలిపోతాయి. తర్వాత వాటిని బాండీలో వేసి పొయ్యి మీద పెట్టి మాడకుండా వేపాలి. వాటిని వెడల్పాటి బేసిన్లో వేసి కొంచెం చల్లారాక, మిక్సీలో వేసి బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత ఒక పల్చటి క్లాత్ లో వేసి జల్లించుకోవాలి. అప్పుడు మెత్తటి పొడి వస్తుంది. దానిని గట్టి డబ్బాలో వేసి భద్రపరుచుకోండి. రాగి పిండి తయార్.

రాగి జావ:- ఒక పెద్ద గ్లాస్ నీరు స్టవ్ మీద ఉంచి తెర్లిన తరువాత, రెండు చెంచాల రాగిపిండి చల్లని నీటిలో కలిపి ఆ వేడి నీళ్ళలో పోసి గడ్డ కట్టకుండా కలుపుతూ ఉండాలి. అది బాగా తెర్లిన తరువాత దించి అందులో పాలు పంచదార వేసుకొని, కాఫీ బదులు ఉదయాన్నే ఒక గ్లాసు తాగి చూడండి. దాని లాభాలు చాలా ఉన్నాయి. తాగిన తర్వాత మీకే తెలుస్తుంది. బజార్లో పొడి కొనే దానికన్న ఇలా మనమే తయారు చేసుకుంటే మనకు తృప్తిగా ఉంటుంది.
కొంచెం శ్రమ అనుకోకుండా తయారు చేసుకుంటే మంచిది. ఇలా త్రాగటం వలన ఒంటికి చాలా బలము కలుగుతుంది. ఇష్టమున్నవారు పంచదార బెల్లం, తేనె, తాటిబెల్లం ఏదైనా సరే వాడుకోవచ్చు. ఇవేమీ వద్దు అని అనుకుంటే వేసుకోకుండా త్రాగవచ్చు. బాగా ఎండలు ఉన్నప్పుడు పాలకు బదులు మజ్జిగ, ఉప్పు వేసి తాగవచ్చు. ఇంకా రుచి రుచి గా తాగాలంటే మీకు కావలసినంత జావా ఒక గిన్నెలో పోసి అందులో కొంచెం పల్చటి మజ్జిగ, ఉప్పు, ఒక పచ్చిమిర్చి, చిటికెడు ఇంగువ వేసి కలపండి. పచ్చిమిర్చి ఒక్కటంటే ఒక్కటి తీసుకొని ముక్కలుగా వేసుకోవాలి. ఉప్పు సరిపడినంత బాగా కలిపిన తరువాత మిర్చి ముక్కలు తీసి వేసి తాగండి ఎంత రుచిగా ఉంటుందో ఆ రుచిని ఆస్వాదించండి. ఆస్వాదించి కామెంట్ పెట్టండి.

రాగి హల్వా:-



రేపు హల్వా చేయాలి అనుకుంటే ఈ రోజు రాత్రి రెండు గ్లాసుల రాగులు తీసుకొని నీటిలో నానబెట్టుకోవాలి. మరుసటి రోజు దానిని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత దాన్ని ఒక పల్చటి క్లాత్ తీసుకుని ఒక గిన్నెలోకి ఆ ముద్దను తీసుకుని క్లాత్లో వేసి పిండుకోవాలి తరువాత మరొక సారి కూడా మిక్సీ లో వేసి పాలు తీసుకోవాలి. తరువాత ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో మూడు చెంచాల నెయ్యి వేసి అందులో జీడిపప్పు వేసి వేయించి పక్కన ఉంచాలి. తరువాత వడకట్టి ఉంచుకున్న రాగి పాలను అడుగంటా చేతితో కలిపి జీడిపప్పు వేయించి తీసిన బాండీలో పొయ్యాలి. స్టవ్ సిమ్ లోనే ఉంచాలి. దానిలోకి సరిపడా బెల్లం కానీ, పంచదార గాని వేసి ఒక చెంచా యాలకుల పొడి వేసి మంట తగ్గించి కలుపుతూ ఉండాలి. లేకపోతే గడ్డకడుతుంది. హల్వా దగ్గర పడ్డదాక కలుపుతూ ఉండాలి. తర్వాత మరల రెండు చెంచాల నెయ్యి, వేయించుకున్న జీడిపప్పు వేసి బాగా కలిపి దించి చల్లారిన తర్వాత ఆరగించండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయే లాగా మెత్తగా రుచిగా ఉంటుంది.

రాగి రొట్టె:-

మీకు కావలసిన మోతాదులో రాగి పిండి తీసుకొని అందులోకి రెండు ఉల్లిపాయలు, మూడు పచ్చిమిర్చి తీసుకొని కచ్చాపచ్చాగా రోట్లో వేసి దంచుకొని ఆ పిండి లో ఈ ముద్ద వేసి ఒక చెంచా జీలకర్ర, తగినంత ఉప్పు వేసి నీరు పోస్తు గట్టిగా పిసికి, ముద్ద లాగా కలుపుకుని ఉంచుకోవాలి. తరువాత ఒక తడి క్లాత్ తీసుకుని, నిమ్మకాయ సైజు అంత ముద్ద తీసుకొని ఆ తడి క్లాత్ మీద పెట్టి పల్చగా వత్తుకోవాలి. స్టవ్ వెలిగించి పెనం మీద నెయ్యి వేసి తయారు చేసుకున్న రొట్టెలు పెనం మీద వేసి కాల్చుకోవాలి. రెండు వైపులా తిరగేసి నెయ్యి వేసి కాల్చుకోవాలి. వేడివేడిగా తినాలి. ఉల్లిగడ్డ కారం నంచుకోండి. సూపరో సూపర్.

రాగి అట్టు:-


రాగి పిండిలో నీళ్లు పోసి కలుపుకొని సరిపడా ఉప్పు వేసి ఒక అరగంట పిండిని నాననిచ్చి అట్టు పోసుకొని కొబ్బరి చట్నీ నంజుకుని తింటే చాలా బాగుంటుంది.

రాగి లడ్డు:-


ముందుగా రాగి లడ్డు కి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో మూడు స్పూన్ల నెయ్యి వేసి, జీడిపప్పు ముక్కలు చేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండిలో కొంచెం కూడా నెయ్యి వేసి రాగి పిండిని బాగా వేయించుకోవాలి. తర్వాత బెల్లాన్నితురుముకోవాలి. ఒక కప్పు పిండికి ఒక కప్పు బెల్లం. ఆ తర్వాత బౌల్లోకి పిండి, బెల్లం, ఏలకుల పొడి, వేయించిన జీడిపప్పు వేసి బాగా కలపాలి. తర్వాత నెయ్యి వేడిచేసి పక్కన ఉంచుకొని ఆ పిండిలో కి తగినంత నెయ్యి వేసుకుంటూ ఉండలు చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన రాగి లడ్డు రెడీ. రోజుకు ఒకటి తింటే చాలు.

రాగి మురుకులు:- (కార పూస) ముందుగా ఒక బౌల్ లోకి ఒక కప్పు రాగి పిండి, దానికి తగినంత ఉప్పు, కారము, కొంచెం వాము, వేడి నూనె కొంచెం అన్ని వేసి కలుపుకుని, కొంచెం, కొంచెం నీరు కలుపుతూ పిండిని ముద్దగా కలుపుకొని ఆ తర్వాత బాండీలో నూనె పోసి, వేడి అయ్యాక పిండిని చక్రాల గిద్ద లో వేసి (సన్న గిద్దలు) చక్రాల్లా తిప్పుకొని వేయించి తీసుకుంటే చాలు టేస్టీ గా ఉండే స్నాక్స్ రెడీ.

ఇది కాక దీనితో పూరీల పిండిలాగా కలుపుకుని పూరీలు చేసుకోవచ్చు. పల్లెటూరు వాళ్ళు ఇప్పటికీ కూడా రాగి పిండి ఉడక పెట్టి గట్టిగా చేసుకుంటారు. తమిళనాడులో ఉదయాన్నే దంతధావనం తర్వాత ఆ రాగి ముద్దను కంచంలో వేసుకొని, అందులో కొంచెం మజ్జిగ పోసుకొని, ఉల్లిపాయ, పచ్చి మిరపకాయ నంజుకుని తింటారు. చాలా చాలా ఆరోగ్యకరమైన ఆహారం ఇది.
ఏ విధంగా అయినా చేసుకొని తినవచ్చు. తిని ఆరోగ్యాన్ని పొందుతారని ఆశిస్తూ... శుభం!




x


Previous
Next Post »

1 Comments:

Click here for Comments
Unknown
admin
31 జనవరి, 2021 6:45 PMకి ×

Very good information

Congrats bro Unknown you got PERTAMAX...! hehehehe...
Reply
avatar