నిజానికి ధనుర్మాసం ప్రారంభమవడంతో నెల రోజులు ముందుగానే తెలుగునాట సంక్రాంతి వాతావరణం మొదలవుతుంది. ఆ నెల రోజులు పల్లెలు, పట్టణాలు ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా మారతాయి. ప్రతీ ఒక్కరు తమ ఇంటి ముంగిళ్ళని ముగ్గులు, గొబ్బెమ్మలతో అలంకరిస్తారు. హరిదాసులు, గంగిరెద్దులవాళ్ళు, బుడబుక్కలవాళ్లు, పగటివేషధారులు, ఇలా రకరకాల జానపద వినోద కళాకారులు తయారవుతారు.
ముఖ్యంగా రైతులు సంవత్సరమంతా కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయం. ఈ ఆనందంలో జరుపుకునే పండుగ కాబట్టి, కళ్లం నుంచి బండ్ల మీద ధాన్యం బస్తాలు తమ ఇంటికి వస్తూ ఉంటాయి. పండుగలన్నిటిలో పెద్ద పండుగ కాబట్టి కొత్త అల్లుళ్ళు తప్పనిసరిగా అత్తవారింటికి వస్తారు. మరదళ్ల ఎకసెక్యాలతో ఉడుక్కుంటూ ఉంటారు. ఇక కోడి పందాలు, ఎడ్ల పందాలు జరుగుతాయి. ఇవన్నీ సంక్రాంతి పండుగకి సరికొత్త శోభని తెచ్చిపెట్టే అతి సామాన్యమైన విషయాలు.
తెలుగు, తమిళ రాష్ట్రాలవారికి సంక్రాంతి చాలా పెద్ద పండుగ. కొన్ని ప్రాంతాలలో దీనిని మూడు రోజులు (భోగి, మకర సంక్రాంతి, కనుమ) జరిపితే, ఇంకొన్ని ప్రాంతాలలో నాలుగు రోజులు (భోగి, మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ) జరుపుతారు. ఎలా జరుపుకున్నప్పటికీ, దేశమంతటా ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యముంది. కాకపోతే, ఆచరించే పద్ధతుల్లోనే భిన్నత్వం ఉంది.
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము. మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభం అవుతుంది అని ఇందాక మనం చెప్పుకున్నాం కదా! సూర్యుడు కర్కాటక రాశి నుండి మొదలై, ఆ తరువాత వరుసగా సింహ, కన్య, తుల, వృశ్చికం, ధనూ రాశులలో కొనసాగినంత కాలము ‘దక్షిణాయణం’. మకర రాశితో మొదలై, కుంభ, మీన, మేష, వృషభ, మిథున రాశులలో కొనసాగినంత కాలము ‘ఉత్తరాయణం’.
మానసికమైన అర్చన, ధ్యానం, యోగం, దీక్ష, బ్రహ్మచర్యం, మరియు నియమ నిష్టలకు అనువైన కాలం దక్షిణాయణం’. శారీరక శ్రమ, పూజ, సాధన, కృషికి అనువైన కాలం ఉత్తరాయణం. పన్నెండు నెలలు ఉన్న సంవత్సర కాలములో ఆరు నెలలు దక్షిణాయణం; మిగిలిన ఆరు నెలలు ఉత్తరాయణం. దేవతలకు ఈ ఆరు నెలలు ఒక రాత్రి, మిగిలిన ఆరు నెలలు ఒక పగలు. ఉత్తరాయణం అంటే దేవతలకు పగలు. కాబట్టే, దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణ పుణ్య కాలము.
భోగి అంటే ‘భోగ భాగ్యాలను అనుభవించే రోజు’ అని అర్ధం. ఎలాగంటే, పాడి పంటలు సమృద్ధిగా ఇళ్లకు వచ్చే సమయం. కాబట్టి, ఈ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి, ప్రతి ఇంటి ముందు భోగి మంటలు వేస్తారు. ఈ భోగి మంటలలో, పాతదనానికి స్వస్తి చెప్పి... కొత్తదనానికి స్వాగతం పలుకుతూ... పనికిరాని పాత బట్టలు, వస్తువులను అందులో పడేసి పీడలను, అరిష్టాలను తొలగించుకుంటారు.
తెల్లవారక ముందే భోగి మంటలతో మొదలై… ఆ రోజంతా కుటుంబంలో కోలాహలం మొదలవుతుంది. మనలో ఉన్న బద్దకాన్ని, అశ్రద్ధన్ని, మనసులో ఉన్న చెడు ఆలోచనల్ని ఈ భోగి మంటలలో వేసి ఈ రోజు నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నామని ఆత్మారామునికి మాట ఇచ్చి భగవంతుని ఎదుట నిశ్చయ సంకల్పం చేసుకోవడం జరుగుతుంది. ఇక ఆరోజు సాయంత్రం స్త్రీలు తమ ఇళ్ళలో బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. అలాగే పేరంటాళ్ళు పిల్లలకు భోగిపళ్లు పోసి... దిష్టి తొలగిస్తారు.
సంక్రాంతి:
సంక్రాంతి రోజున పాలు పొంగించి, దానితో మిఠాయిలు తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్ళలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, చక్కినాలు, పాలతాలికలు, పాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలయిన వంటకాలు చేసి, కొత్తబట్టలు ధరించి ఈ పండుగను ఎంతో ఆనందోత్సవాలతో జరుపుకుంటారు.
ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులటం ఆచారం. సాదారణంగా ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. కానీ, మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వక పోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు.
ఇక డూడూ బసవన్న, హరిదాసులు ప్రతీ ఇంటిముందు సందడి చేస్తారు. అమ్మాయిలు గొబ్బెమ్మల చుట్టూ నృత్యం చేస్తారు. పిల్లలు గాలిపటాలు ఎగురవేస్తారు. మగవారు కోడి పందాలు, ఎడ్ల పందాలతో గడుపుతారు.
పాడి పశువుల పూజించే కనుమ:
కనుమ పండుగను ఆంధ్రా రాయలసీమ ప్రాంతాల్లో రైతులు ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా రైతులు తమ పాడి పశువులను శుభ్రంగా కడిగి, కుంకుమ బొట్లు పెట్టి, మెడలో పూల దండలు వేసి, వాటికి ప్రత్యేక మైన దాణాను వేసి, గోపూజ నిర్వహిస్తారు. అలాగే, పశువుల దొడ్లను క్లీన్ చేసి, పూల తోరణాలు, మామిడి తోరణాలతో అలంకరిస్తారు. పంట చేల వద్ద కొంత మంది రైతులు రేగాకు, జిల్లేడు ఆకులను ఉంచి ఉదయాన్నే ఇంట్లో వండిన పులగాన్ని పంటలపై చల్లడం పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం.
ఇలా దేవతలు, తల్లిదండ్రులు, ఇరుగుపొరుగు, పాడి పశువులు, పంటపొలాలు, ప్రకృతి పట్ల కృతజ్ఞతను, ప్రేమను ప్రకటిస్తారు కాబట్టే పండుగల్లో సంక్రాంతికి అంత ప్రాధాన్యముంది. అందుకే, చదువురీత్యా, ఉద్యోగరీత్యా ఎక్కడున్నా సరే, సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు, వాళ్ళ సొంత ఊళ్ళకి చేరుకుంటారు. కుటుంబ సభ్యులందరితో కలిసి ఆనందోత్సాహాలతో పాలుపంచుకుంటూ ఉంటారు.
ఈ వారం ముగ్గులు:-








2 Comments
Click here for CommentsVery informative 👍👍
ReplyVery Informative andi...
ReplyThanks alot for your valuable time for making out all these
ConversionConversion EmoticonEmoticon